వాగ్దానం – హరికథ
కథాబలం కలిగిన కొన్ని గొప్ప సినిమాలు బాక్సాఫీసువద్ద ఎందుకు విఫలమవుతాయో అంతుతెలియని ప్రశ్న. ఆ కోవకి చెందిన సినిమా కవితా చిత్ర నిర్మాణతలో వచ్చిన ‘వాగ్దానం’(1961). కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి నిర్మాతలుగా మనసు కవి ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా, ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ బాబు 1918లో రచించిన ‘దత్త’ నవలకు తెరరూపం. హేమాహేమీలైన అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, రేలంగి, చలం, కృష్ణకుమారి, సూర్యకాంతం, గిరిజ వంటి నటీనటవర్గంతో నిర్మించిన ఈ సినిమాలో పెండ్యాల స్వరపరచిన పాటలన్నీ హిట్లే. అయితే ఎందుకు ఈ సినిమా విజయవంతంగా ఆడలేకపోయింది? అనే ప్రశ్నకు ఎంత వెదకినా జవాబు దొరకదు. ఈ చిత్రానికి ఇది ఒక పార్శ్వమైతే, ఇందులో దర్శకుడిగా ఆచార్య ఆత్రేయ చేసిన ప్రయోగాలు అమోఘాలు. తన సొంత సినిమా అయినా సహచర సినీకవులకు ప్రాధాన్యమిస్తూ, దాశరథి వంటి గొప్ప కవిని వెండితెరకు పరిచయం చేస్తూ ఆత్రేయ చేసిన ప్రయోగం మెచ్చుకోవలసిన అంశం. ‘వాగ్దానం’ చిత్రంలో మొత్తం 8 పాటలుండగా, ‘నాకంటి పాపలో నిలిచిపోరా’ అనే పాటను దాశరథి చేత రాయించారు. నాలుగు పాటలను ఆత్రేయ, ‘తప్పెట్లో తాళాలో’ అనే ఒక పాటను నార్ల చిరంజీవి చేత, మిగిలిన రెండు పాటలను మహాకవి శ్రీశ్రీ చేత ఆత్రేయ రాయించారు. శ్రీశ్రీ రాసిన రెండుపాటల్లో ఒకటి ‘సీతాకళ్యాణ సత్కథ’. గతంలో వచ్చిన సినిమాలలో శ్రీరాముని మీద అనేక పాటలైతే వచ్చాయిగాని, హరికథకు సంబంధించి వచ్చిన తొలి పాటగా ఈ సీతాకల్యాణాన్ని చెప్పుకోవాలి. మకుటాయమానమైన ఈ హరికథను రచించేందుకు మహాకవి శ్రీశ్రీ ఎంతో పరిశోధన చేశారు. వామపక్ష భావాలు కలిగిన శ్రీశ్రీ ఈ హరికథను అక్షరబద్ధం చేసిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆ హరికథకు సమ్మోహనమైన సంగీతాన్ని సమకూర్చిన పెండ్యాల నాగేశ్వరరావు, గంగా ప్రవాహంలా మాటకు, పాటకు, పద్యాలకు సమానంగా భావోద్వేగాలకు తన గళంలో స్వరవిన్యాసాలు పలికించిన ఘంటసాల, తెరమీద తనదైన శైలిలో రక్తికట్టించిన రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం ఈ హరికథను అజరామరం చేశారు. శ్రీశ్రీ నాస్తికుడు కావచ్చు… కానీ పురాణ ఇతిహాసాలను కూలంకషంగా చదివి వాటిని ఆపోసన పట్టిన మహా పండితుడు అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు.
శరత్ నవల “దత్త” (వాగ్దత్త) ఆధారంగా తీసిన చిత్రం “వాగ్ధానం”. ఈ చిత్రం 05-10-1961 లో విడుదలై సంగీత పరంగా విజయం సాదించింది. నిర్మాతకు నష్టం వాటిల్లినా, కథా, పాటలు చాలా బాగున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. శ్రీ ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం. అక్కినేని, కృష్ణకుమారి, నాగయ్య, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, నటించిన భారీ తారాగణ చిత్రం. ఆత్రేయ స్వయానా రచయిత అయినా, శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర లతో పాటలు వ్రాయించి, తన సౌజన్యత ను చాటు కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ చేసారు. వాటిల్లో శ్రీ శ్రీ వ్రాసిన హరికథ “శ్రీ నగజా తనయం సహృదయం” ఘంటసాల మాస్టారు చే పాడించి చిత్రానికే వన్నె తెచ్చారు. ఘంటసాల గారు హరికథను అద్భుతంగా గానం చేసి ప్రాణం పోశారు. ఇక్కడ రేలంగి హరికథ చెప్పుతుంటే, అక్కడ నాయిక, నాయకుణ్ణి ఓర చూపులు చూడడం, గుర్రం బండి గుంతలో దిగబడితే, నాయకుడు దాన్ని బయటకు నెట్టడం మొదలగు నవి దర్శకుని ప్రతిభకు తార్కాణం. హరికథలో వినిపించిన మాటలు కూడా ఘంటసాల గారివే. ఇప్పుడు హరికథ విందాం, ఘంటసాల గాత్రాన్ని విని ఆనందిద్దాము.
‘వాగ్దానం’ సినిమా-లోని ‘సీతా-స్వయంవర సత్కథను’ (హరికథ) వ్రాసినది విప్లవకవి, నాస్తికుడు అయిన ‘శ్రీశ్రీ’ అంటే చాలామందికి వింతగా తోచవచ్చు. అంతే కాదు ఆ సినిమా లో ఒక్కొక్క కవికి ఒక్కొక్క పాటను వ్రాసే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత, దర్శకుడు ఎవరంటే – ‘ఆత్రేయ!’ దానితో ఆయన నష్టపోయినా అందులోని పాటలు ‘నా కంటిపాపలో నిలిచిపోరా! (దాశరథి)” వంటివి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఈ సినిమాకి సంగీతం అందించినది పెండ్యాల వారు. ఈ హరికథ పాట రసజ్ఞులకు ఎంతో వీనులవిందు చేసింది. . హరికథలోనైతే ఘంటసాలవారి గొంతు నవరసాలను గుప్పించింది. ఇందులో కవి చేసిన ప్రయోగం ఏమిటంటే – కొంత తన దిట్టతనాన్ని చూపిస్తూనే కొన్ని మంచి పద్యాలను కూడా వెతుక్కొని హరికథలో చొప్పించడం. ఈ పాటను తెరపైన పాడినది ‘రేలంగి’, వయొలిన్ సహకారం అందించింది ‘సూర్యకాంతం’. ఇక, కొంచెం వివరంగా ఈ హరికథను గమనించుదాం. ఈ తరంవాళ్ళకు ఉపయోగించేందుకై కొన్ని మాటలకు అర్థాలను ఇచ్చుకుంటూ విశ్లేషిస్తాను. ఎత్తుకోవడం కానడ రాగంలో – గణపతి ప్రార్థన.
శ్రీనగజాతనయం సహృదయం
చింతయామి సదయం
త్రిజగన్మ హోదయం
నగము అనగా పర్వతము – నగజా అంటే పర్వత రాజు కుమార్తె ‘శ్రీ’ అనేది మంగళ వాచక శబ్దం. ధాన్యం అనగా కుమారుడు. మంగళకరమైన పార్వతీ దేవి కుమారుడు, మంచిహృదయం కలిగిన, చింతలను పోగొట్టే దయామయుడు, మూడులోకాలలో శ్రేష్ఠుడు వినాయకునికి మూడులోకాలకెల్లా శ్రేష్ఠుడు అయిన వినాయకుడిని స్మరిస్తాను.
శ్రీరామభ క్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా! కాస్త పాలు, మిరియాలు ఏవైనా? చిత్తం. సిద్ధం. భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో… అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి… ఆహా! అతడెవరయ్యా అంటే –
రఘురాముడు రమణీయ
వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు
సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు
మరో మరుడు మనోహరుడు..రఘూరాముడు
శ్రీరామ కథను ప్ర్రారంభిస్తు కొంత చమత్కార ధోరణిని ప్రదర్శించారు శ్రీరంగం వారు. ‘శ్రీరామకథను’ ‘చెప్పిన కథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను’ అనే చమత్కారం; గాత్రసౌలభ్యంకోసం పాలూ, మిరియాలూ …ఆ సభకు విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి అంటూ కథను ప్రారంభించి రఘు రాముని వర్ణిస్తున్నారు. ‘రఘురాముడు – రమణీయ వినీలఘనశ్యాముడు. రఘురాముడు అందమైన నల్లనిమబ్బువంటి రంగు కలిగినవాడుట. వాడు; నెలరేడు = చంద్రుడు; సరిజోడు సరి సమానమైనవాడు – ఇతడితో సరితూగగలిగిన మొనగాడు; వాని కనులు మగమీలన్ = మగచేపలను – ‘మీనులు +లు = మీలు’ ఏలురా అనగా మించిన అందం కలిగినవి; వాని నగవు రతనాల జాలురా అనగా రత్నాలను తలపింపజేస్తుంది – రత్నాలలాంటి పలువరుస కలిగిన వాడు అని; వాని-జూచి మగవారలైన మైమరచి – వానినినిచూచిన మగవాళ్ళు కూడా తమను తామే మరచిపోయి – ‘పుంసామోహనరూపం’ అంటారు దీనిని; మరుల్-గొనెడు = మోహించే మరో మరుడు = మన్మథుడు; మనోహరుడు = మనసులను దొంగిలించేవాడు (ఇదంతా ‘శంకరాభరణం’ రాగంలో ఉంటుంది)
సనిదనిసగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడు…
ఔనౌను…
సనిస సనిస సగరిరిగరి సరిసనిస..పదనిస..
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినిని..పస పస పస పస…
సఫ సఫ సఫ తద్దీం తరికిటతక…
రఘూరాముడూ రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్..శభాష్…
ఆప్రకారంబుగా వేంచేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం (కిటికీ వంటిది) నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై చెంగట నున్న చెలికత్తె తో ఇలాఅంది–
ఎంత సొగసుగాడే..ఎంత సొగసుగాడే
మనసింత లోనే దోచినాడే… ఎంత సొగసుగాడే…
మోము కలువ రేడే ఏ..ఏ.. ఏ… మోము కలువ రేడే
నా నోము ఫలము వీడే…ఏడు
శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే…
ఎంత సొగసుగాడే..
ఎంత అందగాడే నా మనసు ఇప్పటికిప్పుడు దోచాడు ఏమి అందమే అతనిది. మొఖం చూస్తే కలువల రాజు చంద్రుని వలె ఉంది. ఇతడే….ఇతడేనే ఇన్నినాళ్ళు నేను నోచిన నోముల ఫలము ఈ అందగాడి కోణమేనే అని ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా.. అక్కడ స్వయం వర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి ఇలా అన్నాడుట –
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీతా…
వినయాదిక సద్గుణ వ్రాత.. ముఖ విజిత లలిత జలజాత…
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు…ఊ..ఊ…
అనఘులార = పుణ్య చరితులారా అనుంగు పుత్రి = నాకు ప్రియమైన నా కుమార్తె సీత వినయాదిక = వినయము మొదలైన సద్గుణ = సద్గుణములు వ్రాత = కలిగిన; జలజాత = లేత తామరపువ్వు విజిత = మించునది లలిత = సుకుమారమైన ముఖ = మొఖం అంతే ఇప్పుడు మొత్తం అర్ధాన్ని చూస్తే ముఖ విజిత లలిత జలజాత = లేత తమ పువ్వు సుకుమారాన్ని అందాన్ని మించిన మొఖం కలది. ముక్కంటి = మూడు కన్నులు కలవాడు – శివుడు వింటిని= ధనుస్సుని ఎక్కిడా జాలిన = ఎక్కుపెట్టగలిగిన ఎక్కడి జోడును = సాటిలేనటువంటి; అసహాయశూరుడనైటువంటి యోధుని మక్కువ = ఇష్టం; కోరిక మీరుగా = ప్రకారంగా వరించి = పెళ్లిచేసుకుందామని మల్లెల మావైచి= మల్లె పూవులతో కూర్చిన దండను అతని మేడలో వేసి పెండ్లాడు = పెళ్లి చేసుకో.
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్ల బడి పోయారట…మహా వీరుడైన రావణాసురుడు కూడా..హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము (ధనుస్సు) దీనిని స్పృశించుట యే మహా పాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట తదనంతరంబున….
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ..
తన గురువగు విశ్వామితృని ఆశీర్వాదము తలదాల్చి…
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత..
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత…
ఇనకులము = సూర్యవంశము; తిలకుఁడు = శ్రేష్ఠుడు; నిలకడ గల = కదలక స్ధిరంగా ఉన్న క్రొక్కారు మెరుపు = కొత్తగా కమ్మిన కారు మబ్బు; మెరుపు చంచలంగా క్షణకాలమే ఉంటుంది, ఈయన స్థైర్యవంతుడు కదా అందుకు కారు మబ్బుతో కూడె నీలిమేఘవర్ణుడని ఉద్దేశ్యం. నిల్చి = నిలబడి; తన గురువైనటువంటి విశ్వామిత్రుని ఆశీర్వాదం తీసుకుని ఇప్పుడు వచ్చే ఈ శబ్దాలంకారపు సొంపును గమనించండి. సదమల మదగజగమనముతోడ = మెరసిపోతున్న మదపుటేనుగు నడకవంటి ఠీవితో. వాల్మీకి రాముడి నడకను ఏనుగు నడకతో పోల్చాడు – ‘గజవిక్రాంతగమన, మదమాతంగగామీ’ అనే ప్రయోగాలలో – అందుకనేనేమో త్యాగరాజుగారు కూడా ‘సామజవరగమన’ అని పాడారు.సవ్యంవ వేదిక చెంత = స్వయంవరం జరుగుతున్న ఆ వేదిక వైపుకి నాదహేడుట శ్రారాముడు. మదన = మదనుడు అంటే మన్మధుడు; విరోధి = మన్మధుని భస్మం చేసినవాడు = శివుడు; శరాసనమును = ధనస్సును; తన కారమున బూనిన యంత – ఆ శివుని ధనుస్సుని శ్రీరాముడు తన చేత్తో పట్టుకోగానే—
ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే…
ఘుభిల్లుమనె గుండె నృపులకు..
ఝల్లు మనియె జానకీ దేహమూ…
ఒక నిమేషమ్మునందె.. నయము జయము ను
భయము విస్మయము గదురా… ఆఆ ఆఆ
శ్రీమద్రమారమణ గోవిందో హారి… హారి
భక్తులందరు చాలా నిద్రావస్త లో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి..
జై శ్రీమద్రమారమణ గోవిందో హారి… హారి
శివ ధనుస్సు హిందూ పురాణాల ప్రకారం పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు. సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. రాముడు శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.పరశురాముని కధ ఇంకోసారి పరిశీలిద్దాం.
శ్రీరామచంద్రుడు శివుని ధనుస్సు పట్టుకొని బాణం ఎక్కుపెట్టగానే ఆ పినాకమను ధనుస్సు ఫెళ్ళుమని విరిగిపోయింది. ఈ ఫెళ్ళుమని విల్లి పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారిది. ఆ పద్యం నచ్చి శ్రీరంగం వారు వాడుకున్నారు. మీరు ఈ పాత వింటే ఘంటశాల గారు ఫెళ్ళుమని విల్లు అన్నదగ్గర ‘ఫెళ్ళు’ శబ్దాన్ని ఒత్తి పేలకడమే కాకుండా చాలా పైసదాయిలో పలుకుతారు. ఈ ‘ఫెళ్ళు’ శబ్దం కాకుండా ఇంకో శబ్దమేదైనా వాడి ఉండవచ్చు కానీ అలా కాకుండా ‘ఫెళ్ళు’ శబ్దంతోనే పద్యాన్ని ప్రారంభించడానికి కారణం విరిగింది సామాన్యుడి విల్లు కాదు అది శివునిది మరి అటువంటి విల్లు విరిగినప్పుడు ఆ విరగడంలో కూడా గొప్పతనం ఉండాలి కదా! అదుగో అందుకు ఆ ‘ఫెళ్ళు’ శబ్దాన్ని వాడేరుట. ఆ మర్మం ఘంటశాల వారు గ్రహించేరేమో ఆయన పాడటంలో కూడా ఆ దర్పం చూపించేరు. విల్లు విరగ్గానే అక్కడ ఉన్న రాజుల గుండెల్లో భయం కలిగిందట. జయ సూచకంగా గంటలు మ్రోగాయట. ఆశ్చర్యంతో సీతాదేవి శరీరం ఝల్లుమందిట. ఇవన్నీ ఏకకాలంలో కలిగాయని వరుసగా చెప్పుకొచ్చాడు కాబట్టి క్రమాలంకారం.
భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బంగము కావించినాడు…అంతట..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
పృథుగుణ మణి సంఘాతన్ భాగ్యో పేతన్ సీతన్..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
శ్రీమద్రమారమణ గోవిందో హారి… హారి..
భూతల నాధుడు = భూతలమంతటికి రాజు అయినా శ్రీరాముడు పృథుగుణమణిసంఘాతన్ – దొడ్దగుణాలనే మణులతో కూడినట్టిది; భాగ్యోపేతన్ = అదృష్టంతో కూడినది – లక్ష్మీదేవి; ముఖకాంతివిజిత-సితఖద్యోతన్ – తన ముఖకాంతివలన గెలువబడిన తెల్లని చంద్రుడిని కలిగినది, అయిన సీతను ; ప్రీతుండై = ఎంతో ఇష్టపడి ; పెండ్లి చేసుకున్నాడు. ఈ పద్యంలోని అంత్యప్రాసలను గమనించారా? – తెలుగులో అలాంటి ప్రయోగాలను పుష్కలంగా చేసిన సహజకవి ఎవరంటే – తెలుగువారు గర్వించవలసిన పోతనామాత్యుడు. శ్రీ శ్రీ గారు ఇక్కడ పోతన గారి పద్యం వాడి ముగించేరు
సీతారాముల కల్యాణం అయింది కదా!
పోతనగారి మరొక పద్యాన్ని తలచుకొని మురిసి, ఎవరిదారిని వాళ్ళు వెళ్దాం.
ఉ. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు; మహాశుగమ్ములున్
విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షమువాడు, మేలు పై
జల్లెడువాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులన్
జల్లెడువాడు నైన రఘుసత్తముడిచ్చుత మాకభీష్టముల్ \\
మంగళం కోసలేంద్రాయ – మహనీయగుణాత్మనే
చక్రవర్తీతనూజాయ – సార్వభౌమాయ మంగళం
సర్వే జనా: సుఖినో భవన్తు