తూరుపు సింధూరపు

తూరుపు సింధూరపు

పదం కాదది, ప్రపంచానికి మేలుకొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. త అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా, కోమలమైన పదాన్నయినా శాసించి జనరంజకంగా మలచగలిగే శక్తి ఒక్క శ్రీశ్రీకి ఉందంటే అతిశయోక్తి కాదేమో.

కవిగా శ్రీశ్రీకి తాను “మనుషులుమారాలి” చిత్రం కోసం రచించిన పాటలు ఇష్టమని ఒక ఇంటర్‌వ్యూలో చెప్పారు. “మనుషులుమారాలి” అనే చిత్రం 1969లో విడుదలైంది. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్‌ సంగీతం కూర్చారు. ఈ చిత్రంలోని ‘అరుణ పతాకం ఎగిరింది’, ‘మారాలి మారాలి- మనుషులు మారాలి అనే పాటలు విప్లవ నినాదాన్ని స్వచ్ఛంగా వినిపించాయి. విషాద గీతమైన ‘చీకటిలో కారు చీకటిలో’ అనే పాట చాలా జనాదరణను పొందింది. ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, పి. సుశీల గానం చేసిన ‘తూరుపు సింధూరపు’ అనే పాట శ్రీశ్రీ సంపూర్ణ కవితా వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తోంది.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నించి, గర్జించే శ్రీశ్రీ, `నా హదయంలో నిదురించే చెలి, కలలోనే కవ్వించే సఖీ…` అనే ప్రణయ గీతం రాయగలగడం ఆయనకే చెల్లింది. అటు విప్లవ కవిగా, ఇటు సినీ కవిగా జోడు గుర్రాల స్వారి నల్లేరు మీద బండి నడకలా ఆయన సాగించగలిగారు. “ఆహుతి” సినిమాలోని ‘ప్రేమయే జనన మరణ లీల` గీతం ద్వారా తన సినీ జీవితానికి అంకురార్పణ చేసిన శ్రీశ్రీ సరళమైన పదాలతో ఎంతో లోతైన అర్ధాన్ని తన గీతాల ద్వారా ప్రజలకు అందించారు.

“వెలుగు నీడలు” సినిమాలోని `కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు…` అనే పాట అందుకు నిదర్శనం. “అక్కా చెల్లెళ్లు” చిత్రంలోని `వినరాని మాటలే` అనే పాటలో `జీవితమే ఒక చదరంగం పావులే కదా జీవులందరూ, తెలియనిది ఆట, కనబడదొక బాట` అని జీవిత సారాన్నంతా ఒక్క వాక్యంలో వివరించాడు. ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనె, సయ్యాటలాడెనే`, తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం`, `మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యము ` వంటి సుమధుర గీతాలు శ్రీశ్రీ కలం నుంచి వెలువడ్డాయంటే ఎందరికో నమ్మకం కలగకపోవచ్చు.

అలనాటి మేటి నటి శారదకు జాతీయ స్థాయిలో `ఉత్తమ నటి`గా గుర్తింపునిచ్చిన‌ మలయాళ చిత్రం ‘తులాభారం’. పేదరికం వల్ల‌… పెంచే స్థోమత లేక కన్నపిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు వి. మధుసూద‌నరావు. శోభన్‌బాబు, శారద జంటగా నటించిన ఈ సినిమాలో హరనాథ్, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య భూమిక‌లు పోషించారు. దిగ్గజ స్వరకర్త కె.వి. మహదేవన్ సంగీత సార‌థ్యంలో సంద‌ర్భోచితంగా వ‌చ్చే పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా “మారాలి మారాలి మనుషులు మారాలి”, “పాపాయి నవ్వాలి”, “తూరుపు సిందూరపు”, “చీకటిలో కారు చీకటిలో” వంటి గీతాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తులాభారం’ పేరుతోనూ, హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’ టైటిల్‌తోనూ పునర్నిర్మించారు. నాలుగు వెర్ష‌న్స్‌లోనూ శారద ప్ర‌ధాన పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు… ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన కె. రాఘవేంద్రరావు, పి.సి. రెడ్డి, ఎ. కోదండరామిరెడ్డి తరువాతి కాలంలో అగ్ర దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డం మ‌రో విశేషం. జెమినీ స్టూడియోస్ నిర్మించిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌… అప్పట్లో సిల్వర్ జూబ్లీ వేడుక‌లు జరుపుకుంది. మహాత్మా గాంధీ శతదినోత్సవ జయంతి సందర్భంగా అంటే… 1969 అక్టోబర్ 2న విడుదలైంది.

“తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో

ఉదయ రాగం హృదయ గానం

మరల మరల ప్రతియేడు

మధుర మధుర గీతం జన్మదిన వినోదం”

ప్రకృతితో మమేకమై ఆనందాన్ని పొందడానికి ప్రకృతిని ఆరాధించాలి, ఆస్వాదించాలి. ఆ విధంగా కలిగే తన్మయత్వ భావనతో పాటను ప్రారంభిస్తున్నారు.  సూర్యోదయ సమయంలో సింధూరపు, మందారపు వర్ణాలతో లోకాలకు వెలుగును ప్రసాదించి ప్రపంచ జీవన గమనాన్ని చైతన్యపరిచే వేళ ప్రకృతిలో శ్రావ్యంగా ధ్వనించే ‘ఉదయరాగం’ మానవుని జీవితానికి హృదయరాగమై ప్రతి సంవత్సరం వచ్చే జన్మదిన వినోదంగా ఒక మధురమైన పాటలా సాగిపోతుంటుంది జీవితం.  వామపక్ష భావాలు కలిగిన శ్రీశ్రీ మానవుని పుట్టుకకు సంబంధించి వర్ణించి అక్షరబద్ధం చేసిన తీరు అద్భుతం.

వేల వేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో

వీచె మలయమారుతాలు పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే మలిచె కాంతి తోరణాలు

ఒక జీవి పుట్టుక ఆ జీవి స్వంతానిది కాదు. ఆ పుట్టుక వెనుక ఎన్నో జీవుల, ఎన్నో వేల సంవత్సరాల పరిణామం ఉంది. అందుకే దీన్ని మహాకవి శ్రీశ్రీ ఒకే ముక్కలో తేల్చేశాడు.  “వేల వేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో…” అని. అంటే మన పుట్టుక మన వ్యక్తిగతం కాదు. మనలో ఉన్న పదార్థం, చైతన్యం (వైదిక సంప్రదాయం ప్రకారం ఆత్మ, శరీరం) ఏవీ మన వ్యక్తిగతం కాదు. మన స్వార్జితం అంతకంటే కాదు. అదంతా సమాజానిదే.

సమస్త జీవ కోటిదే. ఈ అనంత జీవ కోటిలో మనమూ అంతర్భాగాలం మాత్రమే. కాబట్టి సమస్త ప్రాణి కోటి శ్రేయస్సే మన శ్రేయస్సు.  వేల వేల సంవత్సరాలనుండి జగత్కారకుడైన పరబ్రహ్మ ఆడుతున్న ఆటలో మానవ సృష్టికి ఆయుత్తమైన శుభ సమయంలో సువాసనలతో కూడిన పరిమళగంధాలు వెదజల్లే వృక్షములతో నిండిన మలయ పర్వతము నుండి పిల్లగాలులు వీస్తుండగా, నక్షత్రాలు హారాలుగా మారి కాంతులు వెదజల్లుతుండగా భూమి స్వాగతం పలికిందట. ఎంత గొప్ప ఊహ.  ఏమి కల్పనా చాతుర్యం.

వలపులోన పులకరించు కన్నులతో

చెలిమి చేరి పలుకరించు మగవారు

మనసులోన పరిమళించు వెన్నెలతో

ప్రియుని చూసి పరువశించు ప్రియురాలు

జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం

ప్రేమంటే ఒక భోగం

కాదు కాదు అది త్యాగం

ప్రేమలో పడిన స్త్రీ, పురుషుల మానసిక స్థితిని పోలుస్తూ – కన్నులలో ప్రేమ భావాన్ని వ్యక్తీకరిస్తూ స్నేహ బంధాన్ని కోరుతూ పలుకరిస్తారుట మగవారు.  అంతవరుకు ఏ భావము లేని మనసులో వెన్నెల సౌరభాలు వెదజల్లగా తాను ఇష్టపడ్డ ప్రియుని చూసి పరవశించిపోతుందట ప్రియురాలు. ప్రేయసి, ప్రియులే కాదు మానవ జాతి మొత్తం స్నేహితులుగా బతకాలని కోరుకుని ‘ జీవితమే స్నేహమయం’ అని వ్రాసేరేమో! అంతే కాకుండా ‘ప్రేమ’ గొప్పదనాన్ని తెలియచేస్తూ   ‘ఈ జగమే ప్రేమమయం’ అని పూర్తిచేసేరు.  ప్రేమని భోగంగా కాకుండా త్యాగంగా చూడమన్న సందేశాన్నిచ్చేరు.