శ్రీ వినాయక వ్రత కథ (Sri Vinayaka Vrata Katha)

శ్రీ వినాయక వ్రత కథ

వినాయకుని వ్రతకథ చదువుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి.

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను, బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, నమస్కరించి ”రుషివర్యా! మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.  ”ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ, విజయాలనూ, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి” అని కోరాడు.


అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్ధ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొక టుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గానీ, వెండితోగానీ, మట్టితోగానీ, విఘ్నేశ్వ రుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి.  అందులో గణశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధా క్షతలు, పుష్పాలు, పత్రా లతో పూజించి, ధూపదీపా లను, వెలగ, నేరేడు మొదలైన ఫలము లను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనా దులతో పూజను ముగించి, యధాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య, భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పున: పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాం బూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతా ల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేతా ఆచరింపబడింది” అని పరమ శివుడు కుమారస్వామికి చెప్పాడు.  కనుక ధర్మరాజా! నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువు లను జయించి సమస్త సుఖాలనూ పొం దుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నల మహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామ ణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు. 

”పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోర కోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసిం చాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతీదేవి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించు కునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంక రించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురా నికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజా సురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి. ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయ మనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్లగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు..

రుషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ, తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషి పత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన రుషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్య లేయని శంకించి, రుషులు తమ భార్యలను విడనాడారు. రుషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది.  రుషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ, మునులూ పరమేశ్వరునికి తెలుప గా, అతడు అగ్నిహోత్రుని భార్యయే రుషిపత్నుల రూపం ధరించిందని చెప్పి రుషు లను సమాధారపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవాదులు ‘పార్వతీ, నీ శాపం వల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవా’ లని ప్రార్థించారు. వినాయకచవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ‘అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దాన్ని మాంస ఖండమనుకుని అతణ్ణి చంపి మణిని తీసుకుపోతుంది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని, తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది.ఆ తరువాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు తన పట్టణంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు, చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని ”దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యు ద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది” అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు ‘శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతినీ కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి యావత్‌ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ”అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా”నని విచారించి, మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించ”మని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలను పరిణయమాడాడు. దేవాదులు, మునులు, కృష్ణుణ్ణి స్తుతించి ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మా పరిస్థితి ఏంటి’ అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్ధినాడు ప్రమాదవశాత్తూ చంద్రుణ్ణి చూసినవాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు.  అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధినాడు దేవతలూ, మహర్షులూ మానవులూ తమతమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.  ఈ కథ చదివినవారు, విన్నవారు, ఈ కథ చదువుకొని అక్షతలు నెత్తిమీద వేసుకున్నవారు ఈ రోజు చంద్రుడిని చూసినా ఎటువంటి దోషం ఉండదు.  ఆ తర్వాత వరసిద్ధి వినాయకునికి మంగళహారతి ఇవ్వాలి.


మంగళహారతి

తొండము నేకదంతమున దోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌

కొండక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‌
తొలుతనవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్‌


ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా
వలవలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!

తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని! దలచిన పనిగా నా విఘ్నములు
తొలగుట కొఱకున్‌
అటుకులు కొబ్బరి పలుకులు!
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షునగ్రసుతునకు! పటుతరముగ

విందుచేతు ప్రార్థింతు మదిన్‌

శ్రీశంభు తనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును!
ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తవ లోకపూజ్యనకును!
జయమంగళం నిత్య శుభమంగళం.

నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు!

వేరువేరుగ దెచ్చి వెడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నెపుడు!! జయ!!
పానకము వడపప్పు పనసమామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు!
తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు మాకు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు !!జయ!!

ఓ బొజ్జ గణపయ్‌ నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు!
కమ్మని నెయ్యియును కడుముద్ద పప్పును బొజ్జవిరుగగ తినుచు పొరలుచును!!జయ!!
వెండిపళ్లెములోన వెయ్యివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళ హారతులు!!జయ!!
సుస్థిరముగ భాద్రపద శుద్ధ చవితి యందు పాసన సజ్జనులచే పూజగొల్తు!
శశిచూడరాదన్న జేకొంటి నొక వ్రతము! పర్వమున దేవగణపతికి నిపుడు!! జయ!!

పునరర్ఘ్యం

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్సం

పాపనాశన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: పునరర్ఘ్యం సమర్పయామి.

ఇప్పుడు మహానైవేద్యం పెట్టాలి.

మహా నైవేద్యం

ఒక పళ్లెములో 21 ఉండ్రాళ్లు, జిల్లేడు కాయలు, పిండి వంటలు,

అన్నం, భోజన పదార్థములు కొంచెం, కొంచెం ఉంచాలి.

దానిపై కొంచెం పెరుగు, ఉప్పు వేసి ఆవునెయ్యి అభికరించాలి.

ఈ కింది విధంగా చదువుతూ మహానైవేద్యం పెట్టాలి.

శో|| సుగన్ధా స్సుకృతాంశ్చైవ మోదకాన్‌ ఘృతపాచితాన్‌
నైవేద్యం గృహ్యాతాందేవ చణముద్గై: ప్రకల్పితాన్‌
భక్ష్యంభోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: కుడుములు, జిల్లేడు కాయలు సహిత షడ్రసోపేత మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయాస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా అంటూ అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామికి రెండు చేతులతో చూపించాలి. అమృతాపిథా నమసి… ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌప్‌క్ష్రాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ మూడుసార్లు నీళ్ళు పళ్లెంలో వేయాలి.
సర్వేజనా! సుఖినోభవంతు

వినాయక వ్రత మహిమ

ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్ధులు ధనమును, సంతానార్ధులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందుదురు. అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరు ఈ వ్రతమును చేయవలెను. పూర్వం ధర్మరాజా దులు రాజ్యమును, దమయంతి నలుని పొందిరి. వృత్తాసురుని చంపినపుడు ఇంద్రుడు, సీతను వెదకునపుడు శ్రీరాము డును, గంగను భువికి తెచ్చు నపుడు భగీరధుడను, క్షీరసాగర మధనం చేయునపుడు దేవాసురులను, కుష్ఠువ్యాధినివారణకై సాంబుడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయము పొందిరి. అటునే ఏదేని బృహ త్కార్యము తలపెట్టినవారు వరసిద్ధి వినాయక వ్రత మొనరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు.
శ్రీవరసిద్ధి వినాయక వ్రతకథ సమాప్తం మంగళం మహత్‌!!

21 ఆకులే ఎందుకు?

వినాయకుడిని 21 రకాల ఆకులతో పూజించడం వెనుక మరో గూఢార్థం ఉందని పురాణాలు కథనాలు వివరిస్తున్నాయి. 21 ఆధ్యాత్మికంగా పవిత్రమైన సంఖ్య. ఎలాగంటే త్రిమూర్తులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (3)  సూర్యచంద్రులు (2)  పంచభూతాలు – గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం (5)  పంచప్రాణాలు – ప్రాణ, ఆపాన, వ్యాన, సమాన, ఉదానాలు (5)  త్రిగుణాలు – సత్త్వ, రజో, తమోగుణాలు (3)  త్రికాలాలు – భూత, భవిష్యత్‌, వర్తమానాలు (3) మొత్తం కలిపి 21.  ఈ విధంగా వినాయ కుని 21 రకాల పత్రాలతో పూజించడం వల్ల ప్రకృతితో సహా సర్వ దేవతలను పూజించి నట్లవుతుందని చెప్తారు.

అరుదైన మూడు తొండాల విగ్రహము…

ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్‌ గణపతిని చూడాలంటే మనం పూనెలో ఉన్న సోమ్వర్‌పేట్‌ జిల్లాకి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీతీరంలో ఉంది ఈ త్రిసూంద్‌ గణపతి దేవాలయం.
భీమజీగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1754లో మొదలు పెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పెర్షియన్‌ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయం ప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్‌ సైనికుడు ఖడ్గమృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు మనదేశంలో మరెక్కడా చూడలేం. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచు తారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణ కర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో సంకటహర చతుర్ధిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా.  ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పక్కర్లేద్దు. తొమ్మిది రోజులు పూనె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి వేలాదిమంది భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్‌ నడిపిస్తోందని చెపుతున్నారు ఇక్కడి అధికారులు.

పత్రితో ఔషధ గుణాలు…

వినాయకునికి సుమాలు సమర్పించడంతో సరిపెట్టకుండా పత్రితో ఎందుకు పూజిస్తారని పిల్లలు అడుగుతుంటారు. పత్రి పూజ వెనుక ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాకుండా శాస్త్రీయ దృక్కోణం కూడా దాగి ఉంది. గణపతి పూజలో ఉపయోగించే పత్రాల్లో ఔషధ గుణాలున్నాయి.  వీటితో గణపతిని పూజించడం వల్ల కాలుష్య నివారణ జరుగుతుంది. అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. వర్షాకాలంలో వచ్చే దోమలు, ఇతరత్రా క్రిమికీటకాలు నశిస్తాయి. పూజ ముగిసిన తర్వాత పత్రిని నీళ్ళలో కలపడం వల్ల చెరువుల్లోని నీరు పరిశుభ్రమౌతుంది. ఏయే పత్రాల్లో ఏయే ఔషధ గుణాలున్నాయో తెలుసుకుందాం.

తులసి పత్రం: వీటిలో విష్ణు తులసి, కృష్ణ తులసి రకాలున్నాయి. తులసి ఆకులు శ్వాసకోస సంబంధ వ్యాధులకు, అజీర్ణ   వ్యాధులకు, కడుపు నొప్పికి వాడతారు. ఇది చర్మ రోగాలను అరికడుతుంది. తేలు కుట్టిన విషాన్ని విరిచేస్తుంది

బిల్వపత్రం: దీనిని మారేడు లేక బిలిబిత్తిరి ఆకు అని పిలుస్తారు. బిల్వపత్రం పత్రి దళం. ఇది శివునికి మిక్కిలి ప్రీతి పాత్రమైంది. శివుని అర్చించేటప్పుడు బిల్వాష్టకం పఠిస్తారంటే ఈ పత్రం ఎంత పవిత్రమైందో అర్థం చేసుకోవచ్చు. దీని పండ్ల గుజ్జు జిగురులా పనిచేస్తుంది.

గఱిక: గఱిక అంటే గడ్డి. ఎత్తుగా పెరిగే రకం గడ్డి. ఇందులో అనేక ఔషధ విలువలున్నాయి. పశువులకు శ్రేష్ఠమైన ఆహారం. గఱికను కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి నూరి దాన్ని కట్టుకడితే ఎదురు దెబ్బల గాయాలు మానుతాయి.

అశ్వత్థ పత్రం: దీనిని రావి ఆకు అంటారు. ఇది జ్వరాలకు, నోటిపూతకు మందుగా ఉపయోగపడుతుంది. దానిపండ్లను ఎండబెట్టి, చూర్ణం వేసి రోజుకు రెండుసార్లు, రెండు చెంచాలు తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.

మాచీపత్రం: కొందరు మాచిపత్రి అంటారు. ఈ ఆకులతో కషాయం చేసి దద్దుర్లు తగ్గించడానికి, వ్రణాలకు వాడతారు. ఇది కుష్ఠు వ్యాధికి మంచి మందుగా పనిచేస్తుంది. తలనొప్పి, పైత్యం, వాతనొప్పులను తగ్గిస్తుంది. కళ్ళకు చలువ చేస్తుంది.

బదరీ పత్రం: దీనిని రేగి ఆకు అంటారు. ఇది జీర్ణకోశ వ్యాధులలో ఉపయోగపడుతుంది. రుచిని పుట్టిస్తుంది. రక్తదోషాలను హరిస్తుంది. బలాన్నిస్తుంది. ఆకుల నురుగు రాస్తే అవి కాళ్లమంటలు, అరిచేతుల మంటలు తగ్గుతాయి.

బృహతీ పత్రం: వాడుకలో వాకుడాకు అంటారు. ఇది ముళ్లచెట్టు. శ్వాస సంబంధమైన వ్యాధులు, శ్లేష్మం, క్షయ, ఉబ్బసం, దగ్గు, తాపం లాంటి అనేక సమస్యలను నివారిస్తుంది.

దేవదారు పత్రం: దేవదారు పత్రాల చిగుళ్లు మేహ శాంతిని కలిగిస్తాయి. దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువజేస్తుంది. ఆ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధులే.

దుత్తూర పత్రం: అంటే ఉమ్మెత్త ఆకు. ఇందులో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. వీటి ఆకులకు ఆముదం రాసి దీపపు సెగ చూపి వెచ్చదనంతో గడ్డలపైన, వ్రణాలపైన రాస్తే పగిలి, చీము కారిపోతుంది.

చూతపత్రం: గృహాలంకరణ మొదలు, సర్వమంగళ కార్యాలలో తోరణంగా ఉపయోగపడే మామిడాకు ఇది. పచ్చి మామిడి ఆకు నలిపి వాసన చూస్తే శ్వాసకోశ ఇబ్బందులు తొలగిపోతాయి.

అపారమార్గ పత్రం: ఉత్తరేణి ఆకు. ఇది పంటి జబ్బులకు మందు. ఉత్తరేణి వేరు దంతధావనకు మంచిది.

విష్ణుక్రాంత: గడ్డి నేలలపైకి పాకుతూ విస్తారంగా పెరుగుతుంది. మరోరకం చిన్న మొక్క తరహాలో ఉంటుంది. దీని కషాయం పైత్య జ్వరాలు, కఫ జ్వరాలు, ఉబ్బసం మొదలైన వాటికి ఉపయోగిస్తారు. వాటి ఆకులు ఎండబెట్టి, ఆకుల పొగ పీలిస్తే రొమ్ము పడిశెం దగ్గు, ఉబ్బసపు దగ్గు తగ్గుతాయి.

కరవీర పత్రం: దీనిని గన్నేరాకు అంటారు. ఇది కంతులను కరిగిస్తుంది. గడ్డలను రానీయదు. జంతు విషాలను విరగ్గొడుతుంది. దురదలను తగ్గిస్తుంది. దద్దుర్లను కుష్ఠును పోగొడుతుంది.

దాడిమీ పత్రం: దీనిని దానిమ్మ పత్రం అంటారు. ఇది వగరుగా ఉండే మంచి ఔషధం. జీర్ణకోశ, మలాశయ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. నీళ్ల విరోచనాలను తగ్గిస్తుంది. దీని కషాయం నులి పురుగులను చంపుతుంది. రక్త గ్రహణి (డిసెంట్రీని)ని తగ్గిస్తుంది. నోటిపూత వచ్చినప్పుడు దానిమ్మ చిగుళ్లు నమిలితే తగ్గుతుంది.

అర్క పత్రం: అంటే జిల్లేడు. జిల్లేడు ఆకులతో విస్తరి కుట్టి, అందులో భోజనం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. కానీ, వైద్యుని సలహా లేకుండా జిల్లేడు ఆకులను వాడరాదు. అలా వాడితే మేలు కన్నా కీడు జరిగే ప్రమాదం ఉంది. జిల్లేడు పాము, తేలు విషాలను హరిస్తుంది. మూర్ఛలను, పక్షవాతాన్ని పోగొడుతుంది.

అర్జున పత్రం: దీనిని మద్ది ఆకు అంటారు. దీనిలో తెల్లమద్ది, నల్లమద్ది అని రెండు రకాలున్నాయి. తెల్లమద్దిని మేహశాంతి, వ్రణాలకు వాడతారు. దీని ఆకుల రసం కీళ్ళ నొప్పులకు, గాయాలకు, వ్రణాలకు పనిచేస్తుంది.

శమీపత్రం: దీనిని జమ్మి ఆకు అంటారు.  ఇది కఫాన్ని హరిస్తుంది. మూలవ్యాధి, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. పాండవులు అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను శమీవృక్షంపై పెడతారు. శమీపత్రంలో ఉన్న ఔషధ గుణాల వల్లే అవి తుప్పు పట్టకుండా ఉన్నాయని పురాణాల్లో చెబుతారు.

సింధూర పత్రం: దీనిని వావిలాకు అంటారు. దీని కషాయం జ్వరాలను, జ్వర దోషాలను తొలగిస్తుంది. ఉబ్బులను, మేహవాతపు నొప్పులను, ఇతర నొప్పులను, కీళ్ల వాపులను, కీళ్ల నొప్పులను హరిస్తుంది.

జాజిఆకులు: ఇవి వాతానికి, పైత్యానికి మందుగా ఉపయోగపడతాయి. జీర్ణాశయ రోగాలకు ఇది చక్కటి మందు. నోటిపూతను మాన్పు తుంది. కామెర్లను పోగొడుతుంది. చర్మరోగాలు, మచ్చలకు ఇది చక్కటి మందు. లివర్‌కు బలాన్ని ఇస్తుంది. పక్షవాతాన్ని, తలనొప్పిని నివారిస్తుంది. గవద బిళ్లకు మందుగా ఉపయోగపడుతుంది.

గండకీ పత్రం: గండకీ పత్రాన్ని వినాయక పత్రం అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన ఆకు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే పండు తుంది. ఆయుర్వేద చికిత్సలో ఈ ఆకును వినియోగిస్తారు.

మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు. స్త్రీలు పూలతో కలిపి మాల కట్టుకుంటారు. ఇది జీర్ణశక్తిని పెంపొందించి, ఆకలిని పుట్టిస్తుంది. ఇంద్రియ పుష్టిని కలిగిస్తుంది.

భక్తుల పాలిట కొంగు బంగారం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల స్వామిగా ప్రసిద్ధుడు. వందల ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు. ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులందరూ కాణిపాకం వెళతారు. ప్రతిరోజూ దేశ, విదేశీ భక్తులు వేలాదిమంది దర్శించుకుంటున్న పావనమూర్తి ఈ వినాయకుడు. తిరుమల, శ్రీకాళహస్తి వంటి ఆలయాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన చిత్తూరు జిల్లాకు మరింత వన్నె తెస్తున్న కాణిపాకంలో వినాయకచవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి.  దేశంలోని వినాయక దేవాలయాలన్నింట్లోకి ఈ ఆలయం చాలా ప్రముఖమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలది. ఇక్కడి దేవుడు సత్య ప్రమాణాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. పరిమాణంలో నిత్యం పెరుగుతూ భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఒకప్పుడు రోజూ ఐదువందల నుంచి పదిహేను వందల మంది భక్తులు స్వామిని దర్శించుకునేవారు. క్షేత్ర మహిమల గురించి క్రమంగా వ్యాప్తి చెందడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నిత్యం వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తున్నారు.

     అలనాటి విహారపురే నేటి కాణిపాకం.  ఆలయ నేపథ్యం గురించి ఎన్నో దశాబ్దాలుగా ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు వికలాంగ సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్వ జన్మ కర్మఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటి వారిగా జన్మించారు.   ఓ ఏడాది గ్రామం కరవుకాటకాలతో అల్లాడిపోయింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దుర్భర స్థితి. కరవును జయించడానికి ఈ ముగ్గురు సోదరులూ తమ పొలంలో ఉన్న ఏత బావిని లోతు చేయడానికి పూనుకున్నారు. బావిని తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని పలుగు, పారల సాయంతో తొలగిస్తుండగా చేతిలో ఉన్న పార రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ ముగ్గురిపైనా పడింది. అంతే… వారి వైకల్యం పోయి మామూలు మనుషులయ్యారు. వెంటనే వారు గ్రామాన్ని పాలిస్తున్న రాజుకూ, గ్రామస్థులకూ జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు బావిని పూర్తిగా తవ్వగా గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించి కొబ్బరికాయలు సమర్పించారు. అలా సమర్పించిన కొబ్బరికా యల నుంచి వచ్చిన తీర్థం ‘కాణి’ స్థలంలో (కాణి అంటే ఎకరం పొలం) పారింది. అప్పటినుంచి విహారపురి కాస్త ‘కాణిపాకరమ్‌’ గా మారింది. కాలక్రమేణా దాన్ని ‘కాణిపాకం’గా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ క్షేత్రం శివ, వైష్ణవ ఆలయాలకు నిలయం. ఈ ప్రాంగణంలో వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి, వరద రాజస్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికీ ప్రత్యేక చరిత్ర ఉంది.

సత్యప్రమాణాలకుప్రసిద్ధి:- బావిలో ఉద్భవించిన గణనాథుడు పరిమాణంలో క్రమేణా పెరుగుతూ రావడం విశేషం. సుమారు 65 సంవత్సరాల క్రితం ఓ భక్తురాలు స్వామివారికి బహూకరించిన కవచాలూ, 2000వ సంవత్సరంలో మరో భక్తుడు ఇచిన వెండి కవచాలూ ప్రస్తుతం స్వామి వారికి సరిపోవడంలేదు. ఒకప్పుడు ఇవి స్వామి ఆలంకరణలో భాగమై ఉండేవి. భక్తులు వీటిని చూసేందుకు వీలుగా ఆలయంలోనే ప్రదర్శనగా ఉంచారు. వరసిద్ధుని కొలువు ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష అనుభవిస్తారని భక్తుల విశ్వాసం. స్వామి వారి ఎదుట సామాన్య భక్తులతో పాటూ రాజకీయ నాయకులూ, వ్యసన పీడితులూ, దురలవాట్లకు బానిసలైన వారూ ప్రమాణాలు చేస్తుంటారు. ఇలా ప్రమాణం చేసిన వాళ్లు చాలామంది తమ అలవాట్ల నుంచి విముక్తి పొంది నిత్యం స్వామి సేవకు తరలివస్తుంటారు.

బాహువులు ఇచ్చినది బాహుదానది;- స్వామివారి క్షేత్రం పక్కనే వున్న బాహుదానదిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ నది వైశిష్ట్యానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. శంఖుడు, లిఖితుడు అనే సోదరులు స్వామివారిని దర్శించుకొనేందుకు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి మధ్యలో తినేందుకు తెచ్చుకున్న ఆహార పదార్థాలూ అయిపోతాయి.  అప్పటికి వాళ్లు కాణిపాకానికి చాలా దూరంలో ఉన్నారు. లిఖితుడు ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న మామిడితోటలో ఓ పండు కోసుకు తింటానని అన్న శంఖుడిని కోరాడు. దొంగతనం చేయడం నేరమని శంఖుడు వారించాడు. అయినా లిఖితుడు అన్న మాటలు పెడచెవిన పెట్టి తోటలోని మామిడిపండు కోసుకు తిన్నాడు. తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్న రాజుకు వివరించి, అతని రెండు చేతులను నరికి వేయించాడు. కానీ తరువాత తమ్ముడి వైకల్యాన్ని చూసి శంఖుడు చాలా బాధపడ్డాడు. ఇద్దరూ తిరిగి కాణిపాకం చేరుకుని, వినాయకుణ్ణి దర్శించుకునే ముందు పక్కనే ఉన్న నదిలో మునగగా… లిఖితునికి పోయిన చేతులు తిరిగి వచ్చాయి. అప్పటినుంచి ఆ నదికి బాహుదా (బాహువులు ఇచ్చినది కనుక) అని పేరు వచ్చింది.

బ్రహ్మోత్సవాలు ఆ ఆలయ ప్రత్యేకత:- వరసిద్ధుని ఆలయంలో వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలూ, ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు. మొదటి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలూ, తరువాత 12 రోజులు ప్రత్యేక ఉత్సవాలూ జరుగుతా యి. కాణిపాకం చుట్టూ ఉన్న 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆలయానికి ఉభయదాతలుగా వ్యవహరిస్తారు. ఏటా వినాయక చవితి పండగ రోజు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. వీటిని దేవస్థానం నిర్వహిస్తుంది. 9 రోజులకు అవి ముగియగానే 12 రోజుల పాటు ఉభయదాతలు ప్రత్యేక ఉత్సవాలను కొనసాగిస్తారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఉత్సవాలన్నీ వేలాదిగా తరలివచ్చే భక్తజనం నడుమ అత్యంత వేడుకగా జరుగుతాయి. రాష్ట్రంలో మరే ఆలయంలోనూ ఇన్ని రోజులపాటు ఉత్సవాలను నిర్వహించరు. ఒకప్పుడు వేలల్లో ఉండే ఆదాయం ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరుకుంది. కాణిపాకం క్షేత్రం తిరుపతికి 80 కిలో మీటర్లు. జిల్లా కేంద్రం చిత్తూరుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గరిక ప్రియుడు;- అష్ట గణపతుల్లో లక్ష్మీ గణపతిని సకల సంపదలూ ఇచ్చే స్వామిగా కొలుస్తారు. ఇక ఆ స్వామికి తొండం కుడివైపునకు ఉంటే ఇంకా శుభం అంటారు. అందుకే ఆసిఫాబాద్‌లో కొలువై ఉన్న లక్ష్మీగణపతి స్వామి అంటే స్థానికులకు ఎంతో నమ్మకం. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌ పట్టణ బ్రాహ్మణవాడలో ఉన్న లక్ష్మీగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో తమ బానిస సంకెళ్లు తెంచమని కోరుకుని స్థానికులు ఇక్కడ లక్ష్మీగణపతి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారట. అప్పట్నుంచీ ఆ చుట్టు పక్కల గ్రామాల భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి కెక్కాడు ఈ స్వామి. మొదట్లో మట్టి గోడలూ, రేకుల పైకప్పుతో నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1972లో పునర్నిర్మించాలని భావించారు స్థానికులు. దాంతో ఆనాటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దండనాయకుల రాంచందర్‌రావు పైకాజీ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ముందు కొచ్చనట్టు చెబుతారు. మూలవిరాట్‌ వినాయకుడి విగ్రహంతోపాటు ఈ లక్ష్మీగణపతి ఆలయంలో శివ పంచాయతన విగ్రహా లైన గణపతి, శివుడు, పార్వతి, వెంకటేశ్వరుడు లక్ష్మి, సూర్యుడు, నాగదేవత విగ్రహాలు కూడా వుంటాయి. ఈ వినాయకుడికి ప్రతీ రోజూ 21 దూర్వాలను (గరిక) సమర్పిస్తూ 21 రోజులు గరికతో పూజలు చేస్తే కార్యసిద్ధి కలుగు తుందనీ సకల సంపదలూ లభిస్తాయని భక్తుల నమ్మకం.

నిమజ్జనం ఆంతర్యం

తొమ్మిది రోజుల పాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఉరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో కలిపేయడం బాధాకరంగానే ఉంటుంది. కాని అది ఒక నియమం. ఒక సంప్రదాయం. నవరాత్రి ఉత్సవాలలో వినాయక విగ్రహాలను మట్టితో, ప్లాస్టిక్‌తో, పింగాణితో, రంగులతో, ఇతర పదార్థాలతో తయారుచేస్తారు. అదే ఆలయాల్లో గానీ, ఇళ్లలోగానీ పెట్టుకునే విగ్రహాలను లోహాలతో తయారుచేస్తారు. లోహాల్లో గూడసత్తు, ఇనుము, ఉక్కులను వాడరు. పంచ లోహ విగ్రహాలు గానీ, కంచువి, వెండివి, బంగారువి గానీ వాడతారు. అవి శాశ్వతంగా ఉంచి పూజలు చేయడానికి పనికి వస్తాయి. ఇంట్లో విగ్రహాలయితే తొమ్మిది అంగుళాలకి మించినవి వాడరాదంటారు. వాటిని రోజూ నియమ నిష్టలతో పూజించాలి. అందుకే తొమ్మిది రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలోగాని, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.  కొంతమంది 3వ రోజు, 5వ రోజులలోనే వారి వీలును బట్టి నిమజ్జనం చేస్తారు. ఆ రోజుల్లో ఇళ్లలో పెట్టిన మట్టి విగ్రహాలను కూడా నిమజ్జనానికి ఇచ్చేస్తారు. వీధి వీధిలో అట్టహాసంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసే ఆనవాయితీ ఆంధ్ర దేశంలో ఏటేటా పెరుగుతూ వస్తోంది. అయితే ఎన్నో అలంకరణలతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసినదే అనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియజేస్తుంది.

నిమజ్జనం ఎలా చేయాలి

వినాయక చవితికి, దసరా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతామూర్తు లను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గణశ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నాడు కానీ 3, 5, 7, 9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏరోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఉరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే. గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటు వంటి సంప్రదాయం పాటించాలి? నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అసాధ్య మైన విషయమేమీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాధుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు ‘శ్రీగణశం ఉద్వాసయామి… శోభనార్థం పునరాగ మనాయచ’ అని చెప్పుకోవడం సంప్రదాయం.

జయజయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

Further Reading

Song

Maha Gannpathim

Artist

K.J.Yesudas

Album

Sindhu Bairavi

Licensed to YouTube by

AdityaMusic (on behalf of Aditya Music(India) Pvt. Ltd.); BMI – Broadcast Music Inc., The Royalty Network (Publishing), and 3 Music Rights Societies

Scroll to Top