వినాయక చవితి (Vinayaka Chaturdhi)

వినాయక చవితి

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల  కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాము. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రము రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలందుకునే వినాయకుడంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి.

విఘ్నేశ్వరుని కథ:- పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి  పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘భక్తా! నీ కోరికేమి ?’ అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివసించాలి’ అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు.  కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, ‘ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది’ అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.  శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెళ్లి  సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు ‘మీకేం కావాలో కోరుకోండి!’ అనగా, విష్ణుమూర్తి ‘ఇది మహిమాన్వితమైన  నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి’ అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో ‘నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని’ వేడు కొన్నాడు.  అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి ‘ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

వినాయక జననము:-  కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.  అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల ‘గజాననుడు’గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.

విఘ్నేశాధిపత్యము:- ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి ‘మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని’ కోరారు.  ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, ‘మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు’ అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో ‘తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప’మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. 

“సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!”

కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడుమార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.  అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.  ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు.

Further Reading

https://youtu.be/KVhS4hRncxw

Song

Suklambaradaram & Vathapi Ganapathim

Artist

Ghanatasala

Album

Vinayaka Chavithi

Licensed to YouTube by

saregama (on behalf of Saregama India Limited); Saregama Publishing, BMI – Broadcast Music Inc., and 1 Music Rights Societies