తరలి రాద తనే వసంతం

తరలి రాద తనే వసంతం

అమ్మ జోలపాటలో రాగమెంత ఉన్నది,

పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది…

కోయిలే తాళం, పైరగాలే మేళం.. మమతే రా…

మమతే రాగం, శ్రమజీవనమే భావం….

ఆహూ ఊహు రోకటి పాటలో లేదా మధుర సంగీతం….

జనబాహుళ్యానికి చేరని సంగీతమెందుకు అని ఒక సంగీత విద్వా౦సుడిని  ప్రశ్నిస్తుంది ఒక అమ్మాయి.

బ్రతుకున లేని శృతి కలదా…

ఎద సడిలోనా లయలేదా?

ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా?

వెన్నెల దీపం కొందరిదా?

అడవిని సైతం వెలుగు కదా! అంటూ కట్టెలు కొట్టుకునే శ్రమ జీవుల గొడ్డలి, రంపం శబ్దాలు పుట్టించే ధ్వని తాళం మధ్య ఆలపిస్తాడు ఒక సంగీత విద్వా౦సుడి కొడుకు ఈ రెండు సినిమాలు బాలచందర్ తీసినవే.  మొదటిది సింధు భైరవి, రెండోది రుద్రవీణ. మొదటి పాట రచయిత ఎవరో తెలుసా?….. గొర్తి సత్యమూర్తి అదేనండి ప్రస్తుత మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ వాళ్ళ నాన్నగారు. రెండో పాట అక్షర క్రీడా తుంటరి చేంబోలు సీతారామశాస్త్రి. తమిళంలో ‘సింధుభైరవి’కోసం ఇళయరాజా ‘పాడిరియేన్బ పాడిపరియేన్‌ పళ్లికూడం తానరియేన్‌…’ పాటను స్వరపరిచారు. దాన్ని ‘పాడలేను పల్లవైన భాషరానిదానను… వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను’ అంటూ సత్యమూర్తి అద్భుతంగా, అర్థవంతంగా రాయడం ఆయన మేధాశక్తికి ఓ ఉదాహరణ మాత్రమే.  సినిమాలు రెండు రకాలు – మనస్సుకు హత్తుకునేవి, మదిని మెలిపెట్టేవి. 

            రుద్రవీణ మొదటి కోవకు చెందిన సినిమా. చిరంజీవి, బాలచందర్, ఇళయరాజా, గణేష్‌పాత్రో, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి హేమాహేమీల కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ . మహరాష్ట్రలో రాలెగావ్‌సిద్ధి అనే గ్రామాన్ని సంస్కరించిన అన్నాహజారేని, ఆంధ్రదేశంలో ఒక ఐ.ఏ.యస్ అఫీసర్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న కథ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన బిలహరి గణపతిశాస్త్రి తనయుడిగా జన్మించి, ఓ వైపు సాంప్రదాయరీతులలో సంగీతాన్ని అభ్యసిస్తూ, మరో వేపు సమాజంలోని అపసవ్య ధోరణులకు ఆవేదన చెందుతూ, అటు తండ్రిని ధిక్కరించలేక, ఇటు అంతఃకల్లోలాన్ని అణుచుకోలేక సతమతమవుతూ చివరికి తెగించి తిరుగుబాటు చేసి నవసమాజ నిర్మాణం వేపు అడుగులు వేసి, సామజిక చైతన్యం తీసుకొచ్చిన యువకుడి చరిత్రే  రుద్రవీణ. 

            ఉదాత్తమైన కథకు ఊపిరిపోయాలంటే అందుకు తగ్గ నటీనటులు కుదరాలి.  అటువంటి వాళ్ళందరూ ఈ చిత్రానికి సరిగ్గా అమరిపోయి పదికాలాల పాటూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రానికి ప్రాణప్రతిష్ట చేశారు. సాంప్రదాయాన్ని సంగీతాన్ని రెండు కళ్ళుగా భావించే తండ్రిగా జెమినీ గణేశన్, సంఘంలో మార్పు కోసం నిత్యం రగిలిపోయే నిప్పుకణిక లాంటి యువకుడిగా చిరంజీవి పోటీపడి నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు, భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. చిరంజీవి స్వతహాగా చక్కని నటుడు. బాలచందర్ లాంటి మేటి దర్శకుల చేతిలో పడితే ఇక చెప్పేదేముంది. సంగీత సాధన చేస్తూ దీనురాలి ఆకలి కేకలు విని ఏకాగ్రత చెదిరే సన్నివేశాల్లో ,’ అలగా జనానికీ ఆటపాటలు కావాలి నాన్నా’  అని వాదిస్తున్నప్పుడు ,’  మానవసేవ ద్రోహమా ? ‘ అని తండ్రిని ధిక్కరించి కచేరిలో పాడినప్పుడు, ఎలక్ట్రిషియన్ చావుకు కారణమైనప్పుడు, ‘ నేను మీ కొడుకు మాత్రమే కాదు , మీ శిష్యున్ని, పెద్ద అభిమానిని కూడా, ఇంతగా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నాకు నచ్చలేదు. అదే నన్ను బాధిస్తోందని ‘ అని బాధపడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఊరిబాగు కోసం వివాహాన్ని రద్దు చేసుకొనే సన్నివేశాల్లో సూర్యనారాయణ శాస్త్రి కనిపిస్తాడు కానీ చిరంజీవి కనిపించడు.

            శోభన కళ్ళతోనే నటించిన సన్నివేశాలు రెండు. అంటరానిదానివి కదూ అని ప్రశ్నింపబడినప్పుడు ఒకసారి, వివాహాన్ని త్యజించబోతూ వరుడైన కథానాయకుడు తన అభిప్రాయం కోరినప్పుడు మరోసారి, కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికించి శభాషనిపించుకుంది.

బాలచందర్ దర్శకత్వ ప్రతిభ గురుంచి చెప్పాలంటే మరో టపా వ్రాయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ‘ ఎవరిమాట విన్నావో, రావో, ఇందు లేవో, భళి, భళి  ‘ అన్న త్యాగరాజ కృతిని సందర్భానుసారంగా వాడుకున్నారు దర్శకుడు. ఎవరి సలహా విని నా వద్దకు రాకుండా ఉన్నావో, అసలున్నావో లేవో అంటూ త్యాగరాజు శ్రీరామున్ని విమర్శిస్తూ అల్లిన కృతి అది. ఆ కృతిని తండ్రితో కలిసి సాధన చేస్తూంటే బిచ్చగత్తె అన్నం కోసం అరుస్తూంటుంది. ఏకాగ్రత కోల్పోయిన సూర్యాన్ని తండ్రి కోప్పడి సంగీతం మీదే మనస్సు లగ్నం చెయ్యమంటాడు. ఇక్కడ బిచ్చగత్తె (సమాజం) అన్నం (సాయం) కోసం ప్రార్థిస్తోంది . కథానాయకుడికి సమాజ సేవ చెయ్యాలనే తపన ఉంది. కానీ తండ్రి అడ్డుపడుతూ సలహాలిస్తున్నాడు. ఇలా త్యాగరాజ కృతిని అటు సంగీతానికి ఇటు సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకోవడం డర్శకుని ప్రతిభా పాటవాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే, ప్రమాదంలో గాయపడి చావుబ్రతుకుల్లో ఉన్న విద్యుత్‌కార్మికున్ని, కథానాయకుడు కారులో కచేరీకి వెళ్తూ చూసే సన్నివేశం నాకు గౌతమ బుద్ధుని కథను జ్ఞప్తికి తెచ్చింది.  గణేష్‌పాత్రో సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. ప్రటి మాటా శక్తివంతంగా ఉంది.

            రుద్రవీణ చిత్రంలోని ఒక అభ్యుదయ సందేశాత్మక గీతం ఇది. సంగీత విద్వాంసుడి కుమారుడు… అడవిలో కట్టెలు కొట్టుకునే వారి దగ్గరకు వచ్చినప్పుడు, ‘మీ నాన్నగారి సంగీతం  వినలేకపోయాం, మీరైనా మాకు పాట వినిపించండి…’ అని కోరినప్పుడు, శ్రామిక ప్రజల కోసం పాడే పాట ఇది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వసంతాన్ని తెలుగు ముంగిళ్లలోకి తెచ్చిన పాట. సహజంగా అభ్యుదయ గీతాల్లో కాస్తంత అలజడిని రేపే లక్షణముంటుంది. కాని అభ్యుదయాన్ని అందమైన వనకన్యలా మలచిన పాట. ఆ పాటలో అభ్యుదయం ఉంటుంది, ఆశలు ఉంటాయి, వికాసం ఉంటుంది. కళ్లు మూసుకుని ఒకసారి వింటే కళ్లు తెరిపించే సందేశాత్మక పాట.

తరలి రాద తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం

గగనాల దాక అల సాగ కుంటే

మేఘాల రాగం ఇల చేరుకోద

వసంతం వస్తేనే  కోయిల కూస్తుంది. కోయిల కూసింది కదా అని వసంతం రాదు.తన సొగసు చూసుకోడానికి వసంతమే వనాల దగ్గరికొస్తుంది. వనాలయితే వసంతం దగ్గరికి పోవు కోయిల పాడినా పాడకపోయినా వసంత కాలం వస్తుంది, తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. వసంతం ప్రవేశిస్తేనే వనాలు సౌరభాలు విరజిమ్ముతాయి. వనాల సౌరభాన్ని చూడడానికి వసంతం స్వయంగా వస్తుంది. అలాగే శ్రామికుల కష్టాన్ని, వారి శ్రమసౌందర్యాన్ని చూడడానికే తాను వచ్చాననే అంతరార్థాన్ని ఇందులో ఎంతో అందంగా వివరించారు.  ‘గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా…’ సముద్రాలలో నీరు ఆవిరి రూపంగా మారి ఆకాశం చేరి, మేఘాలుగా మారకపోతే, వర్షాలు పడవు. శ్రామికుడు కష్టపడి పండించకపోయినా, ఏ పని చేయకపోయినా మానవ మనుగడ సాగదు అనే విషయాన్ని భావకవిత్వంలో పండించారు చేంబోలు సీతారామశాస్త్రి.

వెన్నెల దీపం కొందరిదా

అడవిని సైతం వెలుగు కదా

ఎల్లలు లేని చల్లని గాలి

అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం

పదే పదే చూపే ప్రధాన మార్గం

ఏది సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతె ప్రపంచమేశూన్యం

ఇది తెలియని మనుగడ కథ

దిశ తెలియని గమనము కద ||తరలి||

వెన్నెల కాంతి ప్రకృతి మనకిచ్చే కానుక.  అదేమైనా మనలో కొందరికి మాత్రమే లభిస్తుందా! కొన్ని ప్రాంతాల్లోనే ప్రసరిస్తోందా!  మనుషులెవరు ఉందని అరణ్యాల్లో కూడా సమానంగానే ప్రసరిస్తుంది కదా!  సరిహద్దులంటూ లేకుండా వీచే చల్లటి గాలి అందరికి అందుతోందికదా .  తెలవారుతోందని తెలిపే పక్షుల కిలకిలారావాలు – తెల్లారింది ఇంక లేచి నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యమని మన మార్గం సూచించటంలేదా!  ప్రకృతి తన దగ్గరున్నది మనందరికీ పంచి మన మనుగడ కొనసాగింపే చేయటంలేదా!  ప్రకృతి మనకి  చెబుతున్న సందేశం పట్టించుకోకుండా మన దగ్గరున్నది పంచడం అన్న గుణం లోకపోతే ప్రపంచం శూన్యం అయిపోదా? అని సందేశాన్ని బోధిస్తూ మనల్ని ప్రశ్నిస్తూ సమాధానంగా ఏమి జరుగుతుందో చెబుతున్నారు. ఈ ధర్మాన్ని గ్రహించ లేని మానవా జీవితం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండా చేసే ప్రయాణం వంటిది అని చెప్తున్నారు.

బ్రతుకున లేని  శ్రుతి కలదా

ఎద సడి లోనే లయ లేదా

ఏ కళ కైనా ఏ కథ కైనా

జీవిత రంగం వేదిక కాదా

ప్రజా ధనం కాని కళా విలాసం

ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

కూసే కోయిల పోతె కాలం ఆగిందా

సాగే ఏరే పాడే మరో పదం రాదా

మురళికి గల స్వరముల కళ

పెదవిని విడి పలుకదు కద

పాట వీనుల విందుగా విన గలగాలంటే శ్రుతి, లయ ప్రధానం.  మన జీవితాన్ని మనం  ఆస్వాదించి ఆనందించాలంటే నీ జీవన విధానాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే జీవితంలో నీకు ఆనందం లభిస్తుంది. ఆ లభించే సంతృప్తికరమైన జీవితంలో శృతి లేదా! నీ మనసు నీకు నువ్వేంచేస్తే ఆనందంగా ఉంటావో బోధించిన ఆ మార్గం లయ కాదా! ఏ కల అయినా, ఏ కదా అయినా జరిగేది జరిపించేది మన జీవితమనే రంగస్ధలమే కదా! ఏ కల నేర్చుకున్న దాన్ని ప్రజలూనే కదా ప్రదర్శించి వారిని మెప్పించాల్సింది.  అదే కదా కళల ప్రయోజనం.  ఆ విధంగా నువ్వు నేర్చుకున్న కళలని ప్రజాధనం చేయలేని నాడు నువ్వు ఆ కళలని నేర్చుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. తన కంఠాన్ని శ్రావ్యంగా మలిచి కూత వేసే కోయిల పోయిందని సంగీతం ఆగిపోతుందా! అదే మరో రూపంగా పారే ఏరు చేసే ధ్వని తరంగాలుగా రావొచ్చు. మురళీ గానం అందరం ఆస్వాదిస్తాం. అయితే ఆ మురళీ పలకాలంటే పెదవులు తనను తాకితేనే కదా!  ఆనందం నీ సంతృప్తి మీద ఆధారపడి ఉంది.  నువ్వు నీ జీవితం పట్ల నిబద్ధతతో వ్యవహరించి నువ్వు సాధించిన విషయం జ్ఞానానికి సంతృప్తుడవైతే అదే ఆనందమిస్తుంది.

            కలాన్ని హలంగా చేసి తెలుగు చిత్రసీమలో పరిమళాల పాటలు పండించిన వాడు. అలతి అలతి పదాలతో అందమైన బాణీలు కట్టి సినీ పాటల పూదోటలో సిరివెన్నెలలు కురిపించిన వాడు. ‘‘లాలి జో లాలి జో’’ అంటూ… అమ్మప్రేమకు తన కలంతో హారతి పట్టినా. ‘‘నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని’’ అంటూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్న సమాజాన్ని నిలదీసినా. ‘‘నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా’’ అంటూ.. యువతరానికి జీవిత పాఠాలు నేర్పినా.. అది సిరివెన్నెల కలం కురిపించిన సాహిత్యపు జల్లే అవుతుంది. ‘‘శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ..’’ అంటూ మురిసిన మధుర భక్తుడాయన.  ‘‘జగమంతా కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాదీ’’ అని చెప్పిన అద్భతమైన సాహిత్యకారుడు. చిత్రసీమను తన పాటల పూదోటలో విహరింపజేసిన సరస్వతి మాత ముద్దుబిడ్డ సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  ‘విధాత తలపున ప్రభవించినది..’’ సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవ్వడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను, జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతమంటే ప్రతి ఇంటా అదొక సుప్రభాత సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించిన ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అదీ సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటల పూదండలు కట్టి తెలుగుభాషకు నీరాజనాలందించిన వాడు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.

Scroll to Top