విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది

సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పదాల వెంట కాకుండా, భావాల వెంట పరుగులు తీస్తుంది. ఆయన భావాల వంతెన మీద నడిస్తే ఎలాంటి ఉధృతమైన వాగులనైనా సులభంగా దాటగలం. ఎందుకంటే ఆయన పాట అనుభవసారం. విధాత తలపున ప్రభవించిన అనాది జీవనరాగాల తాలూకు భావాల అనుభూతిని సీతారామ శాస్త్రి కవిత్వీకరించారు. వ్యక్తిత్వ వికాసం… ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట. వక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలంటే ఏం చేయాలి? వైవిధ్యంగా ఆలోచించాలి. నలుగురినీ కలుపుకొని పోవాలి. సమయపాలన కీలకం. చెరగని చిరునవ్వు అత్యంత ప్రధానం. మొక్కవోని ధైర్యం, మొండిపట్టుదలా అవసరం. ఇంకా… ఇంకా.. ఇలాంటివెన్నెన్నో. ‘సిరివెన్నెల’ను ఇంటిపేరుగా మార్చుకున్న చేంబోలు సీతారామశాస్త్రి పాటలు వినేవారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాటల్లో ఇవన్నీ ఎక్కడో ఒక చోట ధ్వనిస్తూనే ఉంటాయి. సీతారామశాస్త్రి రూపం గుర్తుచేసుకున్నవారికి ఎవరికైనా మొదట గుర్తుకొచ్చే విషయం ఆయన నుదుట విభూతి మధ్య పెట్టుకున్న బొట్టు. పెదాలపై చెరగని నవ్వు. నలుగురూ నవ్వుతుంటే చూడటం ఆయనకిష్టం. వంద సమస్యలకు సమాధానం ఒక్క చిరునవ్వు అని నమ్మే వ్యక్తి ఆయన. ‘సిరివెన్నెల ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే’ అని ఆయన్ని బాగా ఎరిగిన వారు చెప్పే మాట. ‘చక్రం’లో హోలీ పాటలో– ‘పంచాంగం చెబితేగానీ పండుగ రానందా సంతోషంగా గడపడానికీ సుముహూర్తం ఉంటుందా?’ అనే పంక్తులు ఆయన ఆలోచనా తీరుకు అద్దంపడుతాయి. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలోనూ– ‘చెమటలేం చిందించాలా శ్రమపడీ పండించాలా? పెదవిపై చిగురించేలా చిరునవ్వులూ..’ అని వ్యంగ్యాస్త్రాలను వదిలారు సీతారామశాస్త్రి.

          సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు తెలియని తెలుగు వాడు నాకు తెలిసి చాలా అరుదు అనుకుంటాను. కానీ అతని పాట విని తరించని వారు ఉండరేమో.. “విధాత తలపున” అను ఈ గేయం సుపరిచితమైన ఆణిముత్యం. ఎన్నిసార్లు ఈ పాట  విన్నా ఏదో తెలియని  ఆనందం…  నాకు అర్థం కాకపోయినా  ఈ పాటలో  ఏదో గొప్ప విషయం వుంది అన్న ఒక సంతృప్తితో గడిపేసాను. కానీ నా ఈ ప్రయత్నముతో ఈ పాట యొక్క బహురూప సౌందర్యము ప్రత్యక్షముగా  కనిపించింది. నాకు బాగా నచ్చిన చరణము “ప్రాగ్దిశ వీణియపైన… ”

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం!
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

          విధాత = బ్రహ్మ; తలపు = హృదయం లేదా ఆలోచన ; ప్రభవించు = జనించు; అనాది = ఆది లేనిది లేదా  నిత్యమైనది; స్పందన = కదలిక లేదా జీవము; ప్రణవము = అక్షరము లేదా ఓంకారము; నాదం = ధ్వని; విన్యాసం = ప్రదర్శన; కనుమ = కొండల నడుమ ఉండే త్రోవ; విరించి = బ్రహ్మ; విపంచి = వీణ.  బ్రహ్మ దేవుని హృదయము నందు పుట్టిన ఆది అంతం లేని వేదం ఓంకారం, ప్రాణ నాడులకు జీవము పోసిన మొదటి శబ్దము ఓంకారము. నిశ్చలమైన కొలనులో విశ్వము యొక్క ప్రతిబింభము వలె కనుల యందు విన్యాసము చేయునది ఓంకారము, కొండల నడుమ ప్రతిధ్వనిస్తున్న బ్రహ్మ వీణ వలె హృదయము యందు మ్రోగుతున్న గానం ఓంకారం.  సృష్టికర్త( బ్రహ్మ) ఆలోచనలలో మొదలైనది సృష్టికి ప్రతిరూపైన ఓం కారం.. ప్రాణనాడులలో కదలికలను తెచ్చినది ఈ ఓంకారం..(కళ్లను కొలనుతో పోల్చారు) విశ్వంలో కళ్ళకు కనిపించే ప్రతిది దైవ ప్రతిరూపమైనది.. బ్రహ్మ మీటుతున్న వీణ యొక్క గానం హృదయమనే పర్వత శ్రేణులలో మ్రోగుతుంది.

సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

          సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది లేదా ప్రవాహం; గమనం = తలపు లేదా ప్రయాణం;   విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ.  మంచి భావము గల సంగీతమును  కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది  జీవితానికి సంబంధించిన గీతం.  బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని.

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

          ప్రాగ్దిశ = తూర్పు; వీణియ = వీణ; దినకర = సూర్యుడు; మయూఖ = కాంతి లేదా కిరణము; తంత్రులు = తీగలు; జాగృత = మేల్కొను; విహంగ = పక్షి; తతులు = గుంపు లేదా సమూహము; వినీల = మిక్కిలి నల్లనైన; స్వనము = శబ్దము; జతి = గాననాట్యయోగ్య శబ్దసంతతి లేదా సామరస్యం;  శ్రీకారము = ప్రారంభం; భాష్యము = సారంశము లేదా వ్యాఖ్యానించు.  తెల్లవారుజాము  ఆకాశమున  పక్షుల కిల కిల శబ్దములు,  తూర్పు దిక్కున నుండి ప్రసవిస్తున్న సూర్య కిరణములు వీణ యొక్క తీగలువలె వుండగా వాటి మీద ఈ పక్షులు విహరిస్తూ నాట్యము చేయగా కలిగినటువంటి గాననాట్యయోగ్య శబ్దసంతతి  ఈ ప్రపంచానికి మొదలు పలుకగా, విశ్వకావ్యము కి ఇది సారంశము కాగా… తూర్పు అనే వీణపై సర్యకిరణాలనే తీగలుగా.. మేల్కొన్న పక్షుల గుంపులు విశాల ఆకాశమనే వేదికపై పలికే కిలకిలారావాలు లయ కాగా అది ప్రపంచానికి మొదలు.. విశ్వమనేది కావ్యమైతే దాని భాష సంగీతం.. సృష్టిలో ప్రతిదాన్లో సంగీతం ఉంటుందని భావం..

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

          గళము = గొంతు; నాద తరంగం = ధ్వని యొక్క అల; చేతన = ప్రాణము; ధ్వానం = ధ్వని; అనాది = మొదలు లేనిది లేదా చిరకాలము; ఆది = మొదలు; తాళము = స్వరబద్ధమైన సంగీతం; అనంతం = అంతం లేనిది; వాహిని = నది; విలాసము = క్రీడ.  పుట్టిన ప్రతి బిడ్డ గొంతు యందు వినిపించే శబ్దము ఓంకారము, జీవము పొందిన హృదయము చేయు మృదంగ చప్పుడు ఓంకారం, మొట్టమొదటి రాగమున, అంతము లేని జీవ నది వలె సాగుతున్న సృష్టి యందు విలాసము ఓంకారము.  పుట్టే ప్రతి శిశువు గొంతులో పలికే శబ్ధ కెరటాలలో (ఏడుపు) కూడా సంగీతమే.. చైతన్యం చెంది స్పందించే గుండె చప్పుడు మృదంగ యొక్క ధ్వని వంటిది.. ఇలా సృష్టిలో జరిగే అనంతమైన ప్రక్రియలు ఓంకారంలో ఇమిడి ఉన్నాయని వివరించారు..

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం

          వుచ్చ్వాసం = శ్వాస లోపలకు తీసుకోవటం; నిశ్వాసం = శ్వాస బయటకు వదలటం.  నా వుచ్చ్వాసం కవిత్వం, నా  నిశ్వాసం గేయం.  నేను పీల్చే ఊపిరి కవిత.. నేను విడిచే ఊపిరి పాట.  సరసమైన , వినసొంపైన స్వరముతో అనగా గొంతుతో ఆత్మ- పరమాత్మా  లేక మనిషి -దేవుడు చేసే ఈ ప్రయాణం గూర్చి చెప్పు ఆ సామ వేదం యొక్క సారాన్నినేను మీకు జీవన గీతంలా వినిపిస్తున్నాను . 

Scroll to Top