చంద్రయాన్ -3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రుని యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.
ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ చంద్రయాన్ -3 కార్యక్రమాన్ని ప్రకటించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు.
నేపథ్యం
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రదర్శించడానికి చంద్రయాన్-2 కార్యక్రమంలో, ఇస్రో ఒక ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్ నౌకను లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) వాహనంపై ప్రయోగించింది. ప్రజ్ఞాన్ రోవర్‌ను మోహరించేందుకు గాను ల్యాండర్, 2019 సెప్టెంబరులో చంద్రుని ఉపరితలంపై దిగేలా ప్రణాళిక వేసారు.
2025 లో ఇస్రో, జపాన్ సహకారంతో చంద్రుని దక్షిణ ధృవం పైకి యాత్ర చేసే ప్రతిపాదన గురించి నివేదికలు వెలువడ్డాయి. దీనిలో భారతదేశం తన వంతుగా ల్యాండర్‌ను అందజేస్తుంది. జపాన్ లాంచర్, రోవర్ రెండింటినీ అందిస్తుంది. ఆ యాత్రలో సైట్ నమూనాలను సేకరించడం, చంద్రునిపై రాత్రివేళ మనుగడ సాగించేందుకు సంబంధించిన సాంకేతికతలు ఉండవచ్చు.
అయితే, చంద్రయాన్-2 లో విక్రమ్ ల్యాండర్ విఫలమవడంతో 2025 లో జపాన్ భాగస్వామ్యంతో తలపెట్టిన చంద్ర ధ్రువ యాత్ర కోసం అవసరమైన ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరొక చంద్రయాత్ర చేపట్టవలసి వచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, క్లిష్టమైన యాత్ర కార్యకలాపాలలో వారి యూరోపియన్ స్పేస్ ట్రాకింగ్ (ESTRACK) మద్దతు ఇస్తుంది.
ఉద్దేశాలు
చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి:
- చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండింగు చేయడం.
- చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం
- చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడానికి, చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు, పరిశీలనలు చేయడం. రెండు గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీల అభివృద్ధి, ప్రదర్శన.
రూపకల్పన
చంద్రయాన్-3 లో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. అవి:
ప్రొపల్షన్ మాడ్యూలు
ప్రొపల్షన్ మాడ్యూలు ల్యాండరు, రోవరులను 100 కి.మీ చంద్ర కక్ష్య వరకు తీసుకువెళుతుంది. ఇది ఒక వైపున పెద్ద సోలార్ ప్యానెల్‌తో కూడిన పెట్టె లాంటి నిర్మాణం. పైన ఉన్న పెద్ద స్థూపం (ఇంటర్‌మోడ్యులర్ అడాప్టర్ కోన్) ల్యాండర్‌కు మౌంటు స్ట్రక్చర్‌గా పనిచేస్తుంది. చంద్ర కక్ష్య నుండి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేసే స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) అనే పేలోడ్ కూడా మాడ్యూలులో ఉంటుంది.
ల్యాండరు
చంద్రునిపై మృదువుగా దిగేది ల్యాండరే. ఇది కూడా పెట్టె ఆకారంలో ఉంటుంది, నాలుగు ల్యాండింగ్ కాళ్లు, ఒక్కొక్కటి 800 న్యూటన్‌ల థ్రస్టునిచ్చే నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్‌లు ఉంటాయి. ఇది, రోవరుతో పాటు అక్కడికక్కడే విశ్లేషణ చేసే వివిధ శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్ళింది.
చంద్రయాన్-2లో లాగా కాకుండా, చంద్రయాన్-3 ల్యాండరులో నాలుగు ఇంజన్‌లు మాత్రమే ఉన్నాయి. చంద్రయాన్-2 లోని విక్రమ్‌లో ఐదు 800 న్యూటన్‌ల ఇంజన్‌లు, ఐదవది కేంద్రంగా స్థిర థ్రస్ట్‌తో అమర్చబడి ఉంది. అదనంగా, చంద్రయాన్-3 ల్యాండర్‌లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ (LDV) ఉంది. చంద్రయాన్-2 తో పోలిస్తే, చంద్రయాన్-3 కాళ్లు మరింత బలిష్టంగా చేసారు.
ల్యాండరులో మూడు పేలోడ్‌లను పంపించారు:
- చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE): ఇది చంద్రుని ఉపరితలపు ఉష్ణ వాహకతను, ఉష్ణోగ్రతనూ కొలుస్తుంది.
- లూనార్ సీస్మిక్ యాక్టివిటీ కోసం పరికరం (ILSA): ఇది ల్యాండింగ్ స్థలం చుట్టూ భూకంపనలను కొలుస్తుంది.
- లాంగ్‌ముయిర్ ప్రోబ్ (LP): ఇది ప్లాస్మా సాంద్రతను, దాని వైవిధ్యాలనూ అంచనా వేస్తుంది.
రోవరు
రోవరు, చంద్రుని ఉపరితలంపై ప్రయాణించి, నమూనాలను సేకరించి, చంద్రుని భౌగోళిక, రసాయన కూర్పును విశ్లేషించే ఒక మొబైల్ ప్రయోగశాల. ఇది ఆరు చక్రాలు (బోగీ వీల్‌లు) కలిగిన దీర్ఘచతురస్రాకార చట్రం.
రోవరు విశేషాలు:
- ఆరు చక్రాల డిజైన్
- 26 కిలోగ్రాముల బరువు (57 పౌండ్లు)
- 500 మీటర్ల పరిధి (1,640 అడుగులు)
- కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు మరియు డ్రిల్‌తో సహా శాస్త్రీయ పరికరాలు
- ఒక చాంద్రమాన రోజు (14 భూమి రోజులు) ఆశించిన జీవితకాలం
- భారతదేశంలోని ల్యాండర్ మరియు గ్రౌండ్ కంట్రోల్ బృందంతో కమ్యూనికేషన్
చంద్రయాన్-3 రోవర్ అనేక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలను చేస్తుందని భావిస్తున్నారు, వాటిలో:
- చంద్రుని ఉపరితలం యొక్క కూర్పు
- చంద్రుని నేలలో నీటి మంచు ఉనికి
- చంద్రునిప్రభావాల చరిత్ర
- చంద్రుని వాతావరణం యొక్క పరిణామం
భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి చంద్రయాన్-3 రోవర్ ఒక పెద్ద ముందడుగు. దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలకు నిదర్శనం. చంద్రునిపై మానవ అవగాహన పెంపొందడానికి ఇది తోడ్పడుతుంది.
ప్రయోగం
చంద్రయాన్-3 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి షెడ్యూల్ ప్రకారం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు ఎల్‌విఎమ్3-ఎమ్4 రాకెట్లో అంతరిక్షం లోకి పంపించారు. చంద్రుడిపైకి వెళ్లే పథంలో అంతరిక్ష నౌకను అనుకున్న కక్ష్యలో చేర్చారు. భూమి, చంద్రుని మధ్య దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు. చంద్రయాన్-3 ఆగస్టు 23 లేదా ఆగస్టు 24న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధిస్తుందని అంచనా వేసారు.
భూమి, చంద్రుల సామీప్యతను గణించి ఇస్రో, చంద్రయాన్ 3 ప్రయోగానికి జూలై నెలను ఎంచుకుంది.