బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ బాలల కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యుక్తవయసుకొచ్చిన పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని బాల సాహిత్యంగా నిర్వచించవచ్చు. పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాధుడు మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి.
రామాయణం, మహాభారతం, బసవపురాణం, కేయూరబాహు చరిత్ర. పోతన గారి భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకుని ఎంతో పురోగతి సాధించి గేయ, పద్య, గద్య, రూపాలలో, చిన్నయసూరి నీతిచంద్రికలో పంచతంత్ర కధలులో బాల సాహిత్యం కన్పిస్తున్నది. కందుకూరి వీరేశలింగం, వెంకట పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతిదీపిక, నీతి కథామంజరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
చందమామ పత్రికను పిల్లలకునచ్చే విధంగా తీర్చిదిద్దడంలో కొడవటిగంటి కుటుంబరావు గారి కృషి మెచ్చుకోదగినది. ఎన్ని ఉద్యోగాలు, ఎక్కడెక్కడ పనిచేసినా 1952 లో చందమామ సంపాదకునిగా ప్రారంభించి 1980 సంవత్సరం ఆగష్టు17 న చనిపోయే వరకు చందమామ పత్రికలో పనిచేశారు. పిల్లల కోసం కృషి చేసిన మహానుభావులలో ప్రముఖంగా
- గిడుగు వెంకట సీతాపతి
- చింతా దీక్షితులు
- ముళ్ళపూడి వెంకట రమణ
- న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి దంపతులు చెప్పుకోదగినవారు.
వీరే కాకుండా ఇంకా చాలామంది కవులు, గేయ రచయితలూ, పాటల రచయితలు పిల్లల కోసం కృషి చేసిన వారున్నారు.