చింతా దీక్షితులు (Chinta Deekshitulu)

చింతా దీక్షితులు

చింతా దీక్షితులు ప్రముఖ కథా రచయిత, బాల, గేయ వాజ్మయ ప్రముఖులు. వీరు తూర్పుగోదావరి జిల్లా లోని దంగేరు గ్రామంలో జన్మించారు. వారి  పితామహులు పేరెన్నిక గన్న వైదిక సాంప్రదాయ నిష్ఠాగరిష్ఠులు. చిన్నప్పటినుంచీ శ్రీ దీక్షితులు గారు ఆంగ్ల భాష అభ్యసించారు.  క్రమక్రమంగా బి.ఏ, ఎల్.టి. పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉపాద్యాయులుగా కుదురుకొన్నారు. ఉద్యోగరీత్యా కనిగిరి, రాజమండ్రి మొదలయిన పట్టణాలలో కొన్నేళ్ళపాటున్నారు. విద్యాశాఖలో డెప్యుటీ ఇనస్పెక్టర్  హోదాలో కోస్తాజిల్లాలలో పలుతావులలో పర్యటించారు.1960సం. బాగా ఆరోగ్యం పాడయినాక కుమారుని ఇంట కడలూరులో పరమపదించారు.  శ్రీ దీక్షితులు గారు సాహితీ సమితి ప్రప్రథమ సభ్యులలో ప్రముఖులు. సమితిలో ప్రవేశించక పూర్వమే అళహసింగరి మొదలయిన పరిశోధక నవలలు కొన్ని రచించారు. సమితిలో ప్రవేశించిన తరువాత ఆయన ఆ ధోరణి విరమించుకున్నారు. క్రమక్రమంగా తన కథానికలతో శ్రీ దీక్షితులు గారు ఆనాడు సమితిలో కథక చక్రవర్తి అని ఖ్యాతి గడించుకున్నారు. వాటినే ఏకాదశి అన్న పేరుతో 11 రచనలతో ఒక ప్రత్యేక సంపుటి వెలువరించారు.  దీనిలో చెంచుదంపతులు చాలా గొప్ప కథ. సాహితికి కథ అన్న మరొక కథానిక శ్రీ దీక్షితులు గారి కథనా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇది భారతీయ భాషలన్నింటిలోనికి ప్రచురించవచ్చునని పలువురి అభిప్రాయము.

      వీరు  పూర్వాచార ఘనతను ప్రశంసించడానికి, ఆధునిక నాగరికతను నిరసించడానికి “వటీరావు ఎం.ఏ.” అనే పాత్ర సృష్టించి దాని ఆధారంగా ఎన్నో కథలను రచించారు. “బాలానందం” అనే పేరుతో పిల్లల కోసం దీక్షితులు కొన్ని కథలను రాశారు. ఇందులోని సూరి, వెంకి, సీతి పాత్రలు పిల్లలను, పెద్దలను బాగా ఆకర్షించాయి. భారతదేశాన్ని గురించి పిల్లలకు అర్థమయ్యేలా ‘మినూ మిసాని’ రాసిన గ్రంథాన్ని ‘మన ఇండియా’ పేరిట తెనిగించారు.  బాలసారస్వతానికి క్రమక్రమంగా తగినంత ప్రాధాన్యం లభించడంలేదు. ప్రభుత్వం ప్రోత్సాహమూలేదు. కాని ఆరోజుల్లో భారతి పత్రిక లో చిన్న పిల్లల కథలు, పాటలు, బాగా ప్రోత్సహించేది. సూరి, సీతి, వెంకి అనే శీర్షికతో దీక్షితులు గారు భారతి పత్రిక లో చాలా కథలు ప్రచురించారు. లీలాసుందరి అన్న పేరుతో ప్రతిభలో ఇంకొక పెద్దకథ ప్రచురించారు. ఇలాగే పిల్లల గేయాలెన్నో రచించారు. ఇవన్నీ లక్కపిడతలు అనే సంపుటిలో వెలువడ్డాయి. దీనికి భారత ప్రభుత్వం బహుమతి లభించింది. వాస్తవానికి శిశు సారస్వతానికి దీక్షితులు గారు పితామహులు వంటివారని అనుకోవచ్చును.  చాలా ప్రాచీన కాలం నుంచి మన ఇళ్ళలో మహిళలనోట అనుశ్రుతంగా ప్రవహిస్తున్న పాటలలో అమూల్య ఖనులున్నాయని గుర్తించి దీక్షితులు గారు లాంటి వారు, శ్రీ నేదునూరి గంగాధరం గారు ఈ పాటల సేకరణకు ఉపక్రమిoచారు. ప్రతిభలో ప్రచురించిన స్త్రీల సారస్వతము అన్న సుదీర్ఘ వ్యాసం వారి చిరకాల పరిశ్రమకు, అభిరుచికి చక్కని తార్కాణం.

       పూర్వం రేడియోలో పిల్లల కోసం ‘బాలానందం’ కార్యక్రమం వుండేది. ఇప్పుడు అనేక తెలుగు టీవి ఛానళ్లున్నాయి, ఏ ఒక్క ఛానలైనా బాలసాహిత్యం ఊసెత్తుతుందా? కొన్ని ఛానళ్లు బాలలకి పాటల పోటీలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో అన్నీ సినిమా పాటలే పాడతారు, బూతుపాటలకక్కడ నిషేధం లేదు.  మాతృభాష నిరంతరాయంగా మనుగడ సాగిస్తేనే బాలసాహిత్యం కూడా విలసిల్లుతుంది. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే జనంలో మాతృభాష పట్ల చైతన్యాన్ని పెంచేందుకు కృషి జరగాలి. ఏవో కొన్ని ప్రభుత్వ సంస్థలు తెలుగు భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం అత్యాశే. ఇలాంటి విషమ పరిస్ఠితుల్లో ‘చింతాదీక్షితులు’ మనకు స్ఫూర్త్తి కావాలి. తెలుగులో ఉన్న  తరతరాల బాలసాహిత్యాన్ని శోధించి, సాధించి తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన వారు చింతా దీక్షితులు గారు. ఆయన ఒక్కరే ఆనాడు ఆ మహత్తర కార్యానికి, పూనుకుని మరుగున పడిన లేదా మేధోచౌర్యానికి గురౌతున్న బాలసాహిత్యాన్ని తల్లిబిడ్డలకందించిన వారు చింతాదీక్షితులు గారు.