తెలుగు అక్షరములు (Telugu Alphabets)

తెలుగు అక్షరములు

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు.ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 16 అచ్చులు, 38 హల్లులు, (గ్) పొల్లు, నిండు సున్న కలిపి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

  1. అచ్చులు
  2. హల్లులు
  3. ఉభయాక్షరములు

అచ్చులు

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

హ్రస్వములు – కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.

దీర్ఘములు – రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.

ప్లుతములు – ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

హల్లులు

హల్లులు 38 అక్షరములు. నుండి వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు.

ఉదాహరణ: అనాలంటే క్ + కలిస్తేనే అవుతుంది. వీటికి ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

సరళములు – హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి – .గ, జ, డ, ద, బ.

పరుషములు – హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి – క, చ, ట, త, ప

స్థిరములు – పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి – ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.

స్పర్శములు – ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.

క వర్గము – క, ఖ, గ, ఘ, ఙ

చ వర్గము – చ, ఛ, జ, ఝ, ఞ

ట వర్గము – ట, ఠ, డ, ఢ, ణ

త వర్గము – త, థ, ద, ధ, న

ప వర్గము – ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

సున్న– దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.

  • సిద్ధానుస్వారము – శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
  • సాధ్యానుస్వారము – వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.

అరసున్న – దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.

విసర్గ – ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్ధానములు

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి – అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాళవ్యములు: దవడల నుండి పుట్టినవి – ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి – ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి – త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల కలయిక నుండి పుట్టినవి – ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి – ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి – ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి – ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి – వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల:-

అచ్చులు (14)

అ       ఆ       ఇ        ఈ       ఉ        ఊ       ఎ

ఏ        ఐ        ఒ        ఓ        ఔ       అం      అః

హల్లులు (34)

క   ఖ   గ   ఘ

చ   ఛ   జ   ఝ

ట   ఠ   డ    ఢ   ణ

త   థ   ద    ధ   న

ప   ఫ   బ    భ   మ

య  ర   ల    వ   శ   ష   స   హ   ళ   క్ష   ఱ

Scroll to Top