శ్రీరామ నవమి – శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

శ్రీరామ నవమి

శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

Sita Rama Kalyanam

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.  వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కల్యాణమే. శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో విశ్వామిత్రుని ఆజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. ఎప్పుడో వేదకాలం నుంచే మిథిలా రాజ్యం ఉండేదని చరిత్రకారులు ఒప్పుకొంటున్నారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరు మీదుగానే సీతమ్మకు వైదేహి అన్న పేరు వచ్చింది. అప్పట్లో జనకుడి రాజధానే ఇప్పటి నేపాల్లో ఉన్న జనకపురి అని ప్రజల నమ్మకం. ఈ జనకపురిలోని భూమిని దున్నుతుండగానే సీతమ్మ తల్లి కనిపించిందని చెబుతారు. సీతమ్మ తల్లి పెరిగి పెద్దదయ్యిందీ, రాముని కళ్యాణం చేసుకున్నదీ ఈ నగరంలోనేనని విశ్వసిస్తారు.  సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఒక భారీ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి ఆరోజుల్లో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకనే ఈ ఆలయానికి ‘నౌలాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది. శివ ధనుర్భంగం చేసిన పిదప సీతారాముల కల్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్ళిమండపంలో వివిధ కల్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు. “సీతాకల్యాణ వైభోగము” అని త్యాగయ్య రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల రాఘవాచార్య ఈ పాటను రచించారు. అప్పటివాళ్లు ఆ కల్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి అ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల రాఘవాచార్య గారికి వందనం.   

కోరస్:   సీతారాముల కళ్యాణము చూతము రారండి 

                శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

చరణం-1: 

సుశీలచూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట 

కోరస్:   చూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట 

సుశీలభక్తి యుక్తులకు ముక్తిప్రదమట 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలభక్తి యుక్తులకు ముక్తిప్రదమట, సురలను మునులను చూడవచ్చురట 

కోరస్:   కళ్యాణము చూతము రారండి 

శ్రీ సీతారాముల కల్యాణం, చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణం, చూతము రారండి చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట — చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట — భక్తి యుక్తులకు ముక్తిప్రదమట, సురలను, మునులను చూడవచ్చురట —  కళ్యాణము చూతము రారండి.  ఈ ఆలాపన అద్భుతం అంతే.  ఈపాటకి ఆంద్ర  దేశంలో లభించిన గౌరవానికి పూర్తిగా ఆద్యులు, అర్హులు గాలిపెంచల నరసింహారావు గారు.  ఈ పాట సాహిత్యం కూడా అపూర్వం అజరామరం.  ఆ ఘనతంతా సముద్రాల రాఘవాచార్య గారికే చెందుతుంది.  ఈ పాటని అనితరసాధ్యంగా పాడిన సుశీలమ్మకి తెలుగు జాతి ఋణపడి ఉంది. ఆమె గొంతులోని, మార్దవం, మాధుర్యం ఈ పాటకి బంగారు పళ్ళేనికి గోడచేర్పులాగా సమకూరేయి. 

సీతారాముల కల్యాణాన్ని చూడటానికి ప్రజలందరూ ఒకరినొకరు పిలుచుకుంటూ వస్తున్నారట.  అసలు ఆ కళ్యాణం చూడడం ఒక వేడుక, అది చూసితీరాల్సిందేనట.  ఇప్పటికి హిందూ వివాహ సమయంలో ‘సీతారాములని’ స్మరించకుండా వివాహ వేడుక జరగదు. వివాహ శుభలేఖ మీద సీతారాముల చిత్రపటం దగ్గరనుంచి శుభలేఖలో 

“జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః 

న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః 

స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః 

ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః” 

దగ్గర్నుంచి వివాహంలో సుముహూర్తం సమయంలో భజంత్రి వారు వాయించే ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ వరకు సీతారాములను గుర్తుచేసుకుంటూనే ఉంటాం. అదుగో వినండి జనకమహారాజు తన సింహాసనమ్మీద నుండి లేచి నిలుచుని ఏదో ప్రకటన చేస్తున్నారు.  జనకమహారాజా! ఓ రాజర్షీ! ఆనందంతో ఉరకలు వేస్తున్నది నీ మనసొక్కటే కాదయ్యా మా అందరి మనసులూను. ఎప్పుడెప్పుడు రామయ్య ఆ శంకరుని విల్లు ఎక్కుపెట్టి మా సీతమ్మను పెళ్ళాడతాడా అని మేమందరమూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. అవునయ్యా అవును! నీ అనుగుపట్టి సీతమ్మ, వరించినది కాబట్టే మా రామయ్య మహాభాగుడు, మహా భాగ్యవంతుడు అయ్యాడు. కాదన్నదెవరు! మా త్యాగయ్య స్పష్టంగా తేల్చిచెప్పాడు కదా, “మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి” అని. సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన సీతమ్మని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది. సీతలేని రాముడు లేడు. సీతమ్మవారిని తెలుసుకోకుండా రాముడు అర్థం కాడని అశోకవనంలో సీతని చూసిన తర్వాతనే హనుమంతునికి తెలిసివచ్చిందట మాకు మా విశ్వనాథవారు చెప్పారులే.  సీతారాముల కళ్యాణం చూసేవారికి ఒక వేడుక   సత్పురుషులకు సార్ధకతను ఇచ్చే దివ్యత్వంతో కూడిన ఉత్సవం.  జీవితంలో పవిత్రమైన ఆలోచనలను ఇంద్రియ నిగ్రహం ద్వారా సాధించగలిగిన వారికి వారిబాధలు, దుఃఖము నుండి స్వేచ్ఛ లభించే మార్గం. 

చరణం-2: 

సుశీలదుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ 

కోరస్:   దుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ 

సుశీలధారుణి శాంతిని స్థాపన చేయగ 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలధారుణి శాంతిని స్థాపన చేయగ, నరుడై పుట్టిన పురుషోత్తముని 

కోరస్:   కళ్యాణము చూతము రారండి 

ఈ చరణంలో శ్రీరాముని అవతార విశేషాలు తెలియచేసేరు. దుర్మార్గులైన అహంకారం, గర్వం కలిగిన వారి అహంకారాన్ని, గర్వాన్ని అణచివేసి, సజ్జనులను వారి బారినుండి రక్షించి ధారుణి  అంటే భూమి.  భూమి యందు శాంతిని స్ధాపించుటకు మానవునిగా పుట్టిన పురుషులలో ఉత్తమునిగా జన్మించిన విష్ణుమూర్తి అంశ కలిగిన శ్రీరాముని కళ్యాణం జరుగుతున్నాది, అందరం చూద్దాం రండి.   

చరణం-3: 

సుశీలదశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి 

కోరస్:   దశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి 

సుశీలజనకుని సభలో హరువిల్లు విరచి 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలజనకుని సభలో హరువిల్లు విరచి, జానకి మనసు గెలిచిన రాముని 

కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

ఈ చరణంలో శ్రీరాముని వృత్తాన్తమ్ గురించి చెప్పేరు.  అయోధ్యను పాలించే జనక మహీపతి కుమారునిగా పుట్టి విశ్వామిత్రుని యాగరక్షణ చేసి, ఇక్కడ విశ్వామిత్రునికి కౌశికుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. (బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా గాధి జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.)  శివ ధనుస్సు హిందూ పురాణాల ప్రకారం పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు.  సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొనుచుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజసౌధం లోని వారెవరూ ఇంతకుముందెన్నడూ దానిని కదిలించలేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సునెత్తి బాణాన్ని సంధించగలరో వారే సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. రాముడు శివధనస్సునెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతారాముల కళ్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు. ఈ విధమైన సచ్చరిత్ర కలిగిన శ్రీరాముని కళ్యాణం జరుగుతనాది రండి అందరం వెళ్లి చూద్దాం. 

చరణం-4: 

సుశీలసిరి కళ్యాణపు బొట్టును బెట్టి 

కోరస్:   బొట్టును బెట్టి 

సుశీలమణి బాసికమును నుదుటను గట్టి 

కోరస్:   నుదుటను గట్టి 

సుశీలపారాణిని పాదాలకు బెట్టి 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలపారాణిని పాదాలకు బెట్టి, పెళ్ళి కూతురై వెలసిన సీతా 

కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

సిరి కళ్యాణపు బొట్టును బెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు బెట్టి అంటూ వధువు సీతాదేవి అలంకరణను అద్భుతంగా వర్ణించెను. ఇదే అలంకరణను మన హిందూ సాంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా మన తెలుగు వారు ఏ చోటనున్నా, తెలుగు రాష్ట్రాలలో పాటిస్తున్నారు.  సీతారాముల కల్యాణం చూసే భాగ్యం నాడు ఎందరికి దక్కిందో కాని తెలుగువారు మాత్రం ఈ పాటతో ఆ దివ్యకళ్యాణాన్ని తమ ఆత్మ చక్షువులతో దర్శిస్తూనే ఉన్నారు. తమ పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూనే ఉన్నారు. తెలుగు పాటల్లో ఇంతకు మించిన TIME MACHINE పాట మరొకటి లేదు. ఎప్పుడు విన్నా సరే TIME MACHINE ఎక్కినట్టై మిథిలా నగరం చేరుకుని ఆ కళ్యాణాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. 

చరణం-5: 

సుశీలసంపగి నూనెను కురులను దువ్వి 

కోరస్:   కురులను దువ్వి 

సుశీలసొంపుగ కస్తూరి నామము తీర్చి 

కోరస్:   నామము తీర్చి 

సుశీలచెంపగ జవ్వాజి చుక్కను బెట్టి 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలచెంపగ జవ్వాజి చుక్కను బెట్టి, పెండ్లి కొడుకై వెలసిన రాముని 

కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

సంపంగి నూనెను కురులను దువ్వి సొంపున కస్తూరి నామము దీర్చి చెంప జవ్వాజి చుక్కను బెట్టి అంటూ వరుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని కళ్లముందు సాక్షాత్కరింప చేసేరు సముద్రాల రాఘవాచార్య గారు.  కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. జవ్వాజి ఆష్టగంధములలో ఒకటి. అవి  కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము. 

 చరణం-6: 

సుశీలజానకి దోసిట కెంపుల ప్రోవై 

కోరస్:   కెంపుల ప్రోవై 

సుశీలరాముని దోసిట నీలపు రాశై 

కోరస్:   నీలపు రాశై 

సుశీలఆణిముత్యములు తలంబ్రాలుగా 

కోరస్:   ...…  .....  ..... 

సుశీలఆణిముత్యములు తలంబ్రాలుగా, శిరముల మెరసిన సీతారాముల 

కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి 

జానకి దోసిట కెంపుల ప్రోవై/రాముని దోసిట నీలపు రాశై ఆణిముత్యములు తలంబ్రాలుగా సీతారాముల శిరముల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతము రారండి. ఈ మాటలు వింటుంటే ఆ కళ్యాణం జరిగే చోటికి వెళ్లిపోవాలని, స్వయంగా దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.  భోజనం చేశాక తాంబూలం వేయకపోతే ఎంత వెలితిగా ఉంటుందో ఎంత ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసినా, ఈ పాట వేయకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 

రాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము. శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద సంచరించి, మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభిస్తుందని ప్రజల నమ్మకం. రాముని పూజించినంత మాత్రాన ధైర్యము, విజయము లభిస్తాయి. రామ నామమును జపించినా, రామకధను వినినా, సీతారామ కళ్యాణం తిలకించి పానకమును ప్రసాదముగా తీసుకొనినా , సీతారాముల  అనుగ్రహం తప్పక కలుగుతుబడని ప్రజల విశ్వాసం. త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. 

కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో  వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశవతారాల్లో ఏడోది రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీ.పూ 5114 జనవరి 10 న జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వృత్తాంతం తెలుసుకొందామా.  

రఘువంశ వర్ణన (దశరథ మహారాజు పూర్వీకులు):  

  1. చతుర్ముఖ బ్రహ్మ 
  2. మరీచి 
  3. కశ్యపుడు 
  4. సూర్యుడు 
  5. మనువు 
  6. ఇక్ష్వాకుడు 
  7. కుక్షి 
  8. వికుక్షి 
  9. భానుడు 
  10. అనరంయుడు 
  11. పృథుడు 
  12. త్రిశంకువు 
  13. దుందుమారుడు 
  14. మాంధాత 
  15. సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌ 
  16. ధృవసంధి 
  17. భరతుడు 
  18. అశితుడు 
  19. సగరుడు 
  20. అసమంజసుడు 
  21. అంశుమంతుడు 
  22. దిలీపుడు 
  23. భగీరతుడు 
  24. కకుత్సుడు 
  25. రఘువు 
  26. ప్రవృద్ధుడు 
  27. శంఖనుడు 
  28. సుదర్శనుడు 
  29. అగ్నివర్ణుడు 
  30. శీఘ్రకుడు 
  31. మరువు 
  32. ప్రశిశృకుడు 
  33. అంబరీశుడు 
  34. నహుశుడు 
  35. యయాతి 
  36. నాభాగుడు 
  37. అజుడు 
  38. దశరథుడు 
  39. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు. 

జనక వంశ వర్ణన (జనక మహారాజు పూర్వీకులు):  

  • నిమి చక్రవర్తి 
  • మిథి 
  • ఉదావసువు 
  • నందివర్దనుడు 
  • సుకేతువు 
  • దేవరాతుడు 
  • బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు. 
  • మహావీరుడు 
  • సుదృతి 
  • దృష్టకేతువు 
  • హర్యశృవుడు 
  • మరుడు 
  • ప్రతింధకుడు 
  • కీర్తిరతుడు 
  • దేవమీదుడు 
  • విభుదుడు 
  • మహీద్రకుడు 
  • కీర్తిరాతుడు 
  • మహారోముడు 
  • స్వర్ణరోముడు 
  • హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు. 
  • జనకుడు సీత, ఊర్మిళ 
  • కుశద్వజుడు మాంఢవి, శృతకీర్తి 

శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవములో ఉచ్చరించ వలసిన కళ్యాణ ప్రవరలు 

శ్రీరామ ప్రవర:-  

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే 

అజ మహారాజ వర్మణః పౌత్రాయ 

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ 

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.  

సీతాదేవి ప్రవర:-  

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు 

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం, 

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం 

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం 

జనక మహారాజ వర్మణః పుత్రీం 

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం 

మంగళం కోశలేంద్రాయ 
మహనీయ గుణాత్మనే 
చక్రవర్తి తనూజాయ 
స్సార్వభౌమాయ మంగళం!