ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో

రక్తాశ్రువులతో నేటిభారతాన్ని రచించిన వేటూరి సుందర రామ్మూర్తి

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో” అనే ఈ పాట 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంలోనిది. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామ్మూర్తి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది మధురస్వరాల కోకిల ఎస్. జానకమ్మ, సంగీతం అందించింది కె. చక్రవర్తి.  స్త్రీ శక్తిస్వరూపిణి. కరుణిస్తే అమ్మ. కన్నెర్రజేస్తే అమ్మవారు. మహాభారతంలో ద్రౌపది సభాపర్వంలో అవమానం పాలవుతుంది. ఎదురుగా భర్తలు ఉంటారు. ఎవరూ స్పందించకపోయినా ఆమె ప్రతిఘటించదు. దీనంగా కృష్ణుడ్ని ప్రార్ధిస్తుంది. అప్పటి ద్రౌపది వేరు. విరాటపర్వంలో ద్రౌపది వేరు. కీచకుడు వెంటపడుతుంటాడు. అక్కడామె ఒంటరి. అబలనని అనుకుంటున్నావేమో. దగ్గరికొస్తే నాశనమైపోతావ్ జాగ్రత్తఅని విరుచుకుపడుతుంది. అదీ స్త్రీ శక్తి అంటే. సమయమొస్తే ప్రాణాలకు తెగిస్తుంది ఆడది.  ఇక సినిమా విషయానికొస్తే సభ్యత మరిచిన విద్యార్థులపై క్లాసురూంలో తిరగబడుతుంది విజయశాంతి. ఇది ప్రతిఘటన చిత్రంలో ఓ సందర్భం. దానికి రాసిందే ఈ దుర్యోధన దుశ్శాసన’ … అంటూ సాగిన గీతం.

ఓ సామాజిక ప్రయోజనంతో రూపొందిన చిత్రం ప్రతిఘటన. ఇందులో కథానాయిక విజయశాంతి కాలేజీ లెక్చరర్. ఆమె భర్త చంద్రమోహన్. కళ్ళెదుటే భార్యను రౌడీలు అవమానిస్తుంటే ఏమీ చేయలేని పిరికివాడు. తరువాత కథానాయిక యుక్తితో ప్రతినాయకుణ్ణి అంతమొందిస్తుంది. ఇదీ కథ. ఈ సినిమాలో విజయశాంతికీ, చంద్రమోహన్ కీ ఓ డ్యూయెట్ ఉంది. మరోటి ఉంటే బాగుణ్ణు అన్నది దర్శకుడు టి. కృష్ణ అభిప్రాయం. అయితే, దాన్ని కథలో ఎక్కడ చొప్పించాలా అని ఆలోచిస్తున్నారు. డ్యూయెట్ కి బదులు క్లాసురూం సన్నివేశానికి పాట పెట్టుకోవచ్చు కదా అని వేటూరిగారు సలహా ఇచ్చారు. ఆ సన్నివేశం ఏంటంటే క్లాసురూంలో బ్లాక్ బోర్డుపై స్త్ర్హీ బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు కొందరు విద్యార్థులు. అపుడే క్లాసులో అడుగుపెట్టిన విజయశాంతి ఆ బొమ్మలు చూసి రగిలిపోతుంది. స్త్ర్హీ ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరిస్తూ, వాళ్ళు చేసిన తప్పును తెలియచేస్తూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వొచ్చు. భారీ డైలాగులు చెప్పొచ్చు. దానికి బదులు ఓ పాట ఉంటే బాగుంటుందన్నది వేటూరిగారి ఆలోచన. మొదట అయిష్టంగానే సరే మీరన్నట్టే పాట రాయండి అన్నారు దర్శకుడు.

ప్రతిఘటనచిత్రంలోని ఎమోషనల్ సాంగ్ వింటున్న ప్రతి స్త్రీ మదిలో ఆవేదన, ఆలోచన రేకెత్తుతాయి. వారి నర నరాల్లో ఉడుకునెత్తురు కుతకుతా ఉడుకుతుంది. ముందుకు దూకమంటుంది. సమాజంతో పోరాడమంటుంది. కీచకుల్లా మారిన మగ జాతికి జ్ఞాన బోధ చెయ్యమంటుంది.వారు తల్లి గర్భమునుండి బయటపడిన వారి జన్మస్ధానాన్ని మరిచిపోయి విచ్చలవిడిగా స్త్రీ జాతితో ఆడుకుంటూ వారి గౌరవాన్ని భంగపరుస్తూ ప్రవర్తిస్తున్న మగవారికి మాతృమూర్తిగా వారి దిశా నిర్దేశం చేసే పాట.

“యత్ర నార్యస్తు పూజ్యన్తే, రమన్తే తత్ర దేవతాః

యత్రైతాస్తు న పూజ్యన్తే, సర్వాస్తత్రా ఫలాఃక్రియాః”

‘‘స్త్రీని గౌరవించే చోట తలపెట్టిన కార్యాలన్నీ సఫలమౌతాయి. ఆడదాన్ని అవమానించే చోట కార్యాలన్నీ విఫలమౌతాయి. అదీ సమాజంలో స్త్రీకి ఉండాల్సిన స్థానం. కానీ, ఇప్పుడేమౌతోంది? ఎంతోమంది కీచకులు మన కళ్ళముందే ఉన్నారు. ఇలాంటి కీచకుల అకృత్యాలకి దర్పణమే ప్రతిఘటనలో ఆ సన్నివేశం.  ఈ సందర్భంలో పాట అనగానే వేటూరి గారికి మదిలో మహాభారతం  విరాటపర్వంలోని ద్రౌపది గుర్తొచ్చిందేమో. కీచకుడుపై ఆమె విరుచుకుపడ్డ విధానం మనసులో మెదిలుంటుంది. బహుశా ఆ సన్నివేశాన్ని తల్చుకుని ఆ  స్ఫూర్తితో పాట రాయడం మొదలుపెట్టుంటారు.  అందుకే పాట ఎత్తుకోవడంలోనే పూర్తి ఆక్రోశంతో  ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలోఅంటూ ప్రారంభించిరక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో – మరో మహాభారతంఆరవ వేదం –  మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం” అంటూ మనల్ని ద్రౌపది వస్త్రాపహరణం దగ్గరికి తీసుకెళ్లారు.  “పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి  -పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి  – తనువంతా దోచుకున్న తనయులు మీరు”  అలాగే ‘‘మీ అమ్మల స్తన్యంతో- మీ అక్కల రక్తంతో- ఎఱ్ఱని తన రక్తాన్ని తెల్లని నెత్తురుజేసి… ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర….’’ అన్న వాక్యాలు మనల్ని- మన పసితనంలోకి తీసుకెళ్తాయి. ఆలోచింపజేస్తాయి.  ఇంకా చెప్పుకోవాల్సింది “ప్రతి భారతీ సతి మానం- చంద్రమతి మాంగల్యం” ఎంత గొప్ప వర్ణన.  “మర్మస్థానం కాదది మీ జన్మస్థానం- మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం”.  ఈ వాక్యంతో ఈ పాట ఔన్నత్యం పరాకాష్టకు చేరుకుంది”. ఇంకా తర్వాతి పాటలో వేటూరి గారి కలం నిప్పులు కక్కి బడబాగ్ని రగిల్చింది.  సంపూర్ణంగా సమాజాన్ని నేటి వ్యవస్ధలనీ, భావి భారత యువతని శూలాలతో గుచ్చి పాతరేసేరని చెప్పుకోవచ్చు.

శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే

మానవరూపంలోనే దానవులై పెరిగితే

సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే

కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో

భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో

నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే

ఏమైపోతుందీ సభ్యసమాజం

ఏమైపోతుందీ మానవధర్మం

ఏమైపోతుందీ ఈ భారతదేశం

మన భారతదేశం మన భారతదేశం

ఇంత మేలుకొలుపు గీతం రాసి చివరగా “ఏమైపోతుందీ సభ్యసమాజం – ఏమైపోతుందీ మానవధర్మం – ఏమైపోతుందీ ఈ భారతదేశం – మన భారతదేశం మన భారతదేశం” అంటూ సమాజం గురించినశించి పోతున్న మానవతా ధర్మాలు, విలువలు ఇంకా అసలు మన భారతదేశం ఏమైపోతుంది అని విచారాన్ని వ్యక్తపరచిన సంస్కారం వేటూరి సంస్కారానికి మచ్చుతునక.  అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సామాజిక ఒరవడి సృష్టించలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు. కానీ, రాష్టస్థ్రాయిలో ఉత్తమ గేయ రచనగా నంది పురస్కారంతో సరిపెట్టుకున్నాం. ఇక పాట ఒకెత్తు. పాటకు తగిన నటనను ప్రదర్శించడం ఒకెత్తు. గాయని జానకి గొంతులోని హావభావాలను అద్భుతంగా ప్రదర్శించగలిగింది విజయశాంతి. ఒక లెక్చరర్ తను వేదనను పాటరూపంల పాఠంగా పిల్లలకు చెప్తున్న దృశ్యం ఇప్పటికీ మన కళ్లముందు మెదులుతుంటుంది. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అన్న సందర్భంగా విజయశాంతి ఎక్స్‌ప్రెషన్ ఆమెకే చెల్లింది.  ఇప్పటికీ స్త్రీల విషయంలో జరుగుతున్న అకృత్యాలకు, ఈ కీచక పర్వానికి ఈ పాట ఎంతయినా అవసరం. స్త్రీలు ఈ పాటతో నూతన ఉత్తేజం పొందాలి. ధైర్యం తెచ్చుకోవాలి. మగ మృగాల్ని, వారి తప్పిదాల్ని చీల్చిచెండాడాలి. సభ్య సమాజాన్ని సృష్టించాలి. మానవ ధర్మాన్ని పాటించాలి. మన సంస్కృతీ సాంప్రదాయాల్ని అజరామరంగా నిలబెట్టాలి. ఈ పాటని ప్రతివాడూ స్ఫూర్తిగా తీసుకుని నవ సమాజాన్ని నిర్మించాలి. 

https://youtu.be/NjCSa8FHD4U